అసలే ఇబ్బందులు.. ఇక్కట్లలో ఉన్న వైసీపీకి తాజాగా భారీ షాక్ తగిలింది. వరుసగా నాయకుల అరెస్టులు.. జైళ్ల పర్వంతో వైసీపీ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఈ నేపథ్యంలో అసలు ఏం చేయాలన్న విషయంపైనే పార్టీ తలకిందలు అవుతోంది. ఒకవైపు కేసుల్లో చిక్కుకుని జైళ్లకు వెళ్లిన వారు.. మరోవైపు.. కేసులు నమోదైన వాళ్లు.. ఇలా.. అనేక మంది ఇప్పుడు వైసీపీకి టార్గెట్ గా మారారు. మాజీ మంత్రి విడదల రజనీ.. కేసు డోలాయమానంలో పడింది. మరోవైపు.. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అరెస్టు కోసం.. పోలీసులు జల్లెడ పడుతున్నారు.
ఇలా.. ఉక్కిరి బిక్కిరి అవుతున్నసమయంలో మరో అనూహ్య ఘటన వైసీపీని ఇబ్బందికి గురి చేసింది. కడప జిల్లాకు చెందిన మైనారిటీ నాయకుడు, మాజీ మంత్రి అంజద్ బాషా సోదరుడు, వైసీపీ నేత.. అహ్మద్ బాషాను పోలీసులు అరెస్టు చేశారు. అది కూడా.. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఆయనను అరెస్టు చేసి కడపకు తరలించే ప్రయత్నం చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. దీంతో వైసీపీ వర్గాలు అలెర్ట్ అయ్యాయి. కాగా.. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు.. కడప నియోజకవర్గంలోని ఓ ప్రాంతంలో స్థలాన్ని కబ్జా చేసినట్టు అహ్మద్ బాషాపై ఫిర్యాదులు వచ్చాయి.
దీనిపై అప్పట్లోనే కేసులు నమోదయ్యాయి. అయితే.. వైసీపీ హయాం కావడంతో ఆయనపై పోలీసులు సహా.. ఎవరూ ఎలాంటి చర్యలు తీసుకోలేక పోయారు. ఇక, కూటమి సర్కారు వచ్చాక.. ఈ కేసు ఫైలుపై ఎమ్మెల్యే మాధవి రెడ్డి ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. దీంతో సోషల్ మీడియా వేదికగా.. అహ్మద్ బాషా.. ఎమ్మెల్యేపై దూషణల పర్వానికి దిగారు. దీంతో కబ్జా కేసు సహా దూషణల కేసు కూడా నమోదైంది. ఇది జరిగి కూడా.. రెండు మాసాలైందని పోలీసులు చెబుతున్నారు. అయితే.. తనపై కేసులు నమోదైన విషయం తెలిసిన అహ్మద్ .. కడప నగరాన్ని వదిలి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
దీంతో విదేశాలకు పారిపోయే ప్రమాదం ఉందని గుర్తించిన పోలీసులు అహ్మద్ బాషాపై టుక్ అవుట్నోటీసులు జారీ చేయించారు. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం అహ్మద్ బాషా.. ముంబయి ఎయిర్పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారులకు చిక్కినట్టు తెలిసింది. వెంటనే ఆయనను అదుపులోకి తీసుకుని కడప పోలీసులకు అప్పగించారు. కాగా.. అహ్మద్ బాషా.. ముంబై నుంచి కువైట్ వెళ్తున్నట్లు ఇమ్మిగ్రేషన్ అధికారులు తెలిపారు.