శ్రీరామ నవమిని పురస్కరించుకుని ఏపీ ప్రతిపక్షం(ప్రధాన కాదు) వైసీపీ సోషల్ మీడియా ఎక్స్‌లో ఓ కీలక పోస్టు చేసింది. మాజీ సీఎం ఆ పార్టీ అధినేత జగన్ ఫొటోను వేసి.. `హిందూ ధర్మ పరిరక్షకుడు` శీర్షికతో ఈ పోస్టును పెట్టింది. దేశ విదేశాల్లోనూ.. తిరుమల తిరుపతి దేవస్థానం కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేశారు అని పేర్కొంది. అంతేకాదు.. తన హయాంలో జగన్ హిందూ ధర్మ పరిరక్షణకు నడుం బిగించిన నేత.. అని కూడా పేర్కొన్నారు.
ఆఖరున విశాఖ, జమ్ము కశ్మీర్, భువనేశ్వర్, చెన్నైతో పాటు.. అమెరికాలోనూ శ్రీవారి ఆలయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని వైసీపీనాయకులు జగన్‌ను ఆకాశానికి ఎత్తేశారు. ఈ పోస్టులో జగన్ ఫొటోకు తిరునామం పెట్టి మరీ పేర్కొనడం గమనార్హం. అయితే.. ఈ పోస్టుపై నెటిజన్ల నుంచి తీవ్ర స్థాయిలో రియాక్షన్ వచ్చింది. “ఔను హిందూ ధర్మ పరిరక్షకుడు.. నెయ్యి కల్తీ చేశారు“ అని ఒక నెటిజన్ పేర్కొనగా.. మరికొందరు తిరుమలలో కేకులు కట్ చేసి.. క్రిస్మస్ జరుపుకొన్న ఘనత కూడా వైసీపీ హయాంలోనే జరిగిందని పేర్కొన్నారు.
ఇంకొందరు.. `హిందూ ధర్మ పరిరక్షకుడు.. నిత్యం బైబిల్ చదువుతాడు. ప్రభువుతో మాట్లాడతాడు` అని వ్యంగ్యాస్త్రాలు సంధిం చారు. మరికొందరు.. మరింత ఘాటుగా పోస్టుకు రిప్లయి ఇచ్చారు. “హిందూ ధర్మ పరిరక్షకుడి హయాంలోనే రామతీర్థంలో రాముడి తలను నరికేశారు. దుర్గమ్మ అమ్మవారి ఆలయానికి చెందిన రథం వెండి సింహాలను దొంగిలించారు. అంతర్వేదిలో రథాన్ని తగలబెట్టారు.. ఇదంతా కూడా హిందూ ధర్మ పరిరక్షణ కోసమే చేశారు“ అని మండిపడ్డారు. ఇక, కొందరు.. “హిందూ ధర్మ పరిరక్షకుడి కుటుంబంలో అందరూ శ్రీవారి భక్తులే. నిత్యం తిరుమలకు వెళ్తారు“ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఇలా నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో సదరు పోస్టును కొంత సేపు వైసీపీ నాయకులు మ్యూట్ చేయడం గమనార్హం. అయితే.. తర్వాత.. ఇది సోషల్ మీడియాల్లో హల్చల్ చేయడం గమనార్హం. శ్రీరామ నవమిని పురస్కరించుకుని హిందూ ఓటర్లను ఆకట్టుకునే గిమ్మిక్కు.. అని రాజకీయ నాయకులు విమర్శలు గుప్పించారు. “ప్రస్తుతం వక్ఫ్ బోర్డుకు సానుకూలం వైసీపీ ఓటేసిందన్న విమర్శలు వస్తున్న సమయంలో ఆ రాజకీయాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు జగన్ హిందూ పరిరక్షకుడి అవతారం ఎత్తారు“ అని టీడీపీ నేత ఒకరు వ్యాఖ్యానించారు.