మెగాస్టార్ చిరంజీవి మాజీ అల్లుడు, శ్రీజ కొణిదెల మొదటి భర్త శిరీష్ భరద్వాజ్ హఠాన్మరణం చెందారు. గత కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న శిరీష్.. 39 ఏళ్లకే తుది శ్వాస విడిచారు. లంగ్స్ డ్యామేజ్ తో ఇటీవల చెన్నై హాస్పిటల్ లో చేరిన శిరీష్.. చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందారు.
చిరంజీవి చిన్న కూతురు శ్రీజ.. శిరీష్ భరద్వాజ్ ను ప్రేమించింది. అతడితోనే జీవితం అనుకుంది. కానీ చిరంజీవి శ్రీజ ప్రేమను అంగీకరించలేదు. దాంతో శ్రీజ తన కుటుంబాన్ని ఎదిరించి ఇంట్లో నుంచి పారిపోయింది. 2007లో శిరీష్ భరద్వాజ్ ను ఆర్య సమాజ్ లో రహస్యంగా పెళ్లి చేసుకుంది. వీరికి మీడియా అండగా నిలబడడంతో.. శ్రీజ-శిరీష్ భరద్వాజ్ పెళ్లి వ్యవహారం అప్పట్లో పెను సంచలనం రేపింది.
వివాహం అనంతరం శ్రీజ ఒక కుమార్తెకు జన్మనిచ్చింది. కానీ శిరీష్ భరద్వాజ్ తో శ్రీజ ఎక్కువ కాలం కలిసి ఉండలేక పోయింది. 2012లో కట్నం కోసం శిరీష్ తనను మానసికంగా శారీరకంగా వేధిస్తున్నాడంటూ శ్రీజ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2014లో విభేదాలు పెరగడంతో శ్రీజ, శిరీష్ భరద్వాజ్ విడాకులు తీసుకున్నారు. కొన్నాళ్ల తర్వాత చిరంజీవి తన చిన్న కూతురికి వ్యాపారవేత్త కళ్యాణ్ దేవ్ తో మళ్లీ వివాహం జరిపించారు.
ఈ జంటకు కూడా ఒక కుమార్తె జన్మించింది. అయితే గత ఏడాది కళ్యాణ్ దేవ్ తో సైతం శ్రీజ డైవర్స్ తీసుకుంది. మరోవైపు శిరీష్ భరద్వాజ్ 2019లో హైదరాబాద్ కు చెందిన డాక్టర్ విహనను పెళ్లి చేసుకుని చెన్నైలో సెటిల్ అయ్యాడు. అలాగే ఇటీవల బీజేపీలో చేరి క్రియాశీలక రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించాడు. కానీ ఇంతలోనే ఊపిరితిత్తుల సమస్యతో శిరీష్ మరణించడంతో.. ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.