ఏపీలో జగన్ సర్కార్ తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై తీవ్ర దుమారం రేగిన సంగతి తెలిసిందే. పొలం పాస్ బుక్ లపై జగన్ ఫొటో ఉండడం, ఆ తర్వాత రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల ఒరిజినల్ కాపీని ప్రజలకు ఇవ్వరు అని ప్రచారం జరగడం సంచలనం రేపుతోంది. ఈ క్రమంలోనే జగన్ కు ఓటేస్తే జనం ఆస్తులు జగన్ జేబులోకి అన్న ప్రచారం మొదలైంది. ఈ నేపథ్యంలోనే ఆ చట్టంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ చట్టం అమల్లోకి వస్తే మీ ఇల్లు మీది కాదు..మీ భూములు మీవి కావు..ఈ చట్టాన్ని తెచ్చిన జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించాలి అని ప్రజలకు లోకేశ్ పిలుపునిచ్చారు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో 2020 ఏప్రిల్ నుంచి 2023 మే వరకు రెవెన్యూ శాఖకు 1.34 లక్షల భూ సంబంధిత ఫిర్యాదులు వచ్చాయని, వాటిలో భూ ఆక్రమణలపై ఫిర్యాదులు 31 వేలు అని, రికార్డుల్లో తప్పులు దొర్లిన అంశంపై వచ్చిన ఫిర్యాదులు 39 వేలు అని విమర్శించారు. ఫిర్యాదు చేయనివ్వకుండా బెదిరించిన, అధికారులు తీసుకోని ఫిర్యాదుల సంఖ్య వేరే ఉందని చెప్పారు.
ఈ చట్టం అమల్లోకి వస్తే మీ భూముల దస్తావేజులు చేతికివ్వరని…అధికారం, డబ్బు, కండబలం ఉంటే ఎవరి భూమినైనా రాజకీయ నేతలు కొట్టేసే అవకాశముందని లోకేశ్ ఆందోళన వ్యక్తం చేశారు. సరైన కాగితాల్లేవని యజమానులనే జైల్లో పెట్టే అవకాశముందని ఆరోపించారు. భూ హక్కులపై వారసత్వాన్ని అధికారులు మాత్రమే నిర్ణయించగలుగుతారని లోకేశ్ అన్నారు. ప్రజల స్థలాన్ని జగన్ బ్యాంకులో తనఖా పెట్టే అవకాశముందని, అన్యాయం అని కోర్టులకు వెళ్లలేని పరిస్థితులు వస్తాయని అన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు.
టీడీపీ జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూడా ఈ చట్టాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.