“ఏపీ సీఎం జగన్ .. వైనాట్ 175 అంటున్నాడు. అంత లేదు. ఆయనకు, ఆయన పార్టీకి 15 చాలు. ప్రతిపక్షంలో కూర్చోవాలి కదా! కూటమి ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో.. ఎలాంటి అభివృద్ధి సాధిస్తుందో చూడాలి కదా! కాబట్టి 15 సీట్లు చాలు“ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలను అభివృద్ధి-విధ్వంసం మద్య జరుగుతు న్న ఎన్నికలుగా పేర్కొన్నారు. రాష్ట్రాన్ని గడిచిన ఐదేళ్లలో విధ్వంసం చేశారని ఆరోపించారు. పోలవరం కడతామని కట్టలేద న్నారు. హోదా తెస్తామని తేలేదని చెప్పారు. ఇవన్నీ.. చూస్తే.. సగటు పౌరుడు హృదయం మండి పోతోందని తెలిపారు.
“నా పెళ్లాం గురించి జగన్ మాట్లాడుతున్నాడు. ఆయన పెళ్లాం భారతి గారి గురించి మేం మాట్లాడితే.. ఏం చేస్తాడు. కానీ, మాకు సంస్కారం ఉంది. అందుకే ఈ విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకవెళ్లాలని నిర్ణయించుకున్నాం“ అని పవన్ అన్నా రు. ఉమ్మడి కృష్ణాజిల్లాలోని మచిలీపట్నంలో నిర్వహించిన వారాహి విజయభేరి యాత్రలో పవన్ ప్రసంగించారు. వివేకానందరెడ్డి కి నరికించిన వారిని వెనుకేసుకు వస్తున్న జగన్కు ఎందుకు ఓటేయాలని పవన్ ప్రశ్నించారు. మూడు పార్టీలూ జతకడితే.. ఆయనకు మంటగా ఉందని.. కానీ రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ప్రజలు ఆయన పాలనతో మంటెత్తి పోతున్నారని పవన్ వ్యాఖ్యానించారు.
సోనియా అంటే దడ!
“వైసీపీ నాయకులు చెబుతున్నారు… సోనియాను జగన్ రెడ్డి దడదడలాడించాడని.. కానీ, ప్రత్యేక హోదా విషయంలో కనీసం ఆమె ముందు ప్లకార్డు పట్టుకుని నిలబడేందుకు కూడా జగన్ కు దడ పుట్టి దాక్కున్నాడు. ఇలాంటివాళ్లా మాకు చెప్పేది“ అని వపన్ వ్యాఖ్యానించారు. మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని.. కులాన్ని అడ్డం పెట్టుకుని తనపై ఆరోపణలు చేస్తున్నాడని విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం కేంద్రాన్ని మెడలు వంచుతానని అధికారంలోకి వచ్చిన జగన్.. మోడీ ముందు మెడలు వంచారని విమర్శలు గుప్పించారు. జగన్పై గులక రాళ్లు వేయాల్సిన అవసరం తమకు లేదన్నారు. అసలు ఆయనే రాయి వేయించుకుని.. తమపై మోపుతున్నాడని పవన్ ఆరోపించారు.