విశాఖ పోర్టులో 25 వేల కిలోల డ్రగ్స్ లభించిన ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై వైసీపీ రెబల్ నేత రఘురామ తీవ్రంగా స్పందించారు. ఆ డ్రగ్స్ బ్రెజిల్ నుంచి వచ్చినట్టు తేలిందని, అయితే, 2022 అక్టోబర్ 31న బ్రెజిల్ అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తిని అభినందిస్తూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారని గుర్తు చేశారు. జగన్, విజయసాయిలకు బ్రెజిల్ లో వ్యాపారాలు లేకపోతే శుభాకాంక్షలు ఎందుకు చెబుతారని రఘురామ ప్రశ్నించారు. కనీసం బ్రెజిల్ అధ్యక్షుడి పేరు ఇక్కడి నాయకుల్లో ఒక్క శాతం మంది చెప్పినా తాను ముక్కున వేలు వేసుకుంటానని సెటైర్లు వేశారు. అటువంటిది బ్రెజిల్ అధ్యక్షుడి గురించి విజయసాయి ఎందుకు ట్వీట్ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
బ్రెజిల్ అధ్యక్షుడెవరో విజయసాయికి తెలుసని, కానీ, ఈనాడు డ్రగ్స్ కంటెయినర్ దొరుకుతుందని ఆనాడు వారు అంచనా వేసి ఉండరని చురకలంటించారు. తొందరపాటులో ట్వీట్ చేసి ఈ రోజు దొరికిపోయారని ఎద్దేవా చేశారు. ఇంటర్నేషనల్ డ్రగ్స్ డీల్ ప్రభుత్వ పెద్దలతోనే సాధ్యమవుతుందని చెప్పారు. మలేషియా, సింగపూర్ దేశాల్లో ఒక్క గ్రాము డ్రగ్స్ దొరికినా ఉరిశిక్ష విధిస్తారని, టన్నుల్లో డ్రగ్స్ దిగుమతి చేసుకున్న వీరిని ఏం చేయాలని ప్రశ్నించారు. డ్రగ్స్ దిగుమతి అయిన కంపెనీ పురందేశ్వరి బంధువులదని సాక్షిలో రాయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా కూటమి తరపునే పోటీ చేస్తానని, జగన్ మళ్లీ కోలుకోని విధంగా కూటమిని గెలిపించుకుందామని అన్నారు