టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర దిగ్విజయంగా ముగిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే యువగళం విజయోత్సవ సభ జరగనుంది. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలోని పోలిపల్లిలో జరగబోతున్న ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆల్రెడీ టీడీపీ అధినేత చంద్రబాబు, ఎమ్మెల్యే బాలకృష్ణ విశాఖకు చేరుకున్నారు. విమానాశ్రయం వద్ద ఈ ఇద్దరికీ టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. పవన్ మరి కాసేపట్లో ఎయిర్ పోర్టుకు చేరుకోబోతున్నారు.
దాదాపు పదేళ్ల తర్వాత చంద్రబాబు, పవన్ ఒకే వేదికపై కనిపించబోతున్నారు. ఈ సభకు విశిష్ట అతిథులుగా బాలకృష్ణ, పవన్ హాజరుకానున్నారు. ఈ సభకు దాదాపు 6 లక్షల మంది హాజరు కాబోతున్నారని అంచనా. విశాఖ, విజయనగరం రైల్వేస్టేషన్ల వద్ద టీడీపీ, జనసేన అభిమానుల కోసం ప్రత్యేక రవాణా సౌకర్యం కల్పించారు. భోగాపురం నుంచి విశాఖ వరకు భారీ స్థాయిలో హోర్డింగ్లు, ప్లెక్సీలు వెలిశాయి. కార్యకర్తలు, నేతలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా టీడీపీ యువగళం వాలంటీర్లు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
200 ఎకరాల విస్తీర్ణంలో జరగనున్న సభకు వచ్చే వాహనాల పార్కింగ్ కోసం 250 ఎకరాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 600 మందికిపైగా వేదికపై కూర్చునేలా 156 అడుగుల వెడల్పు, 64 అడుగుల పొడవుతో భారీగా సభావేదిక ఏర్పాటు చేశారు. సభలో చివరి వ్యక్తికి కనిపించేలా అతి పెద్ద ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు.