వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై వైసీపీ మద్దతుదారులు మండిపోతున్నారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలంటే ఆమెతో కలిసి నడిచామని అలాంటిది తమకు మాటమాత్రం కూడా చెప్పకుండానే షర్మిల కాంగ్రెస్ లో కలిసిపోవటం ఏమిటంటు మద్దతుదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఈనెల 6వ తేదీన షర్మిల తన పార్టీకి కాంగ్రెస్ లో విలీనం చేయటానికి ముహూర్తం నిర్ణయించుకున్నారనే ప్రచారం అందరికీ తెలిసిందే. ఢిల్లీలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో షర్మిల భేటీ అవటంతో విలీనం అన్నది కేవలం లాంఛనమే అని అర్ధమైపోతోంది.
ఈ నేపధ్యంలోనే పార్టీలో మొదటి నుండి షర్మిలతోనే నడిచిన కొండా రాఘవరెడ్డి మండి పోతున్నారు. షర్మిల తమను మోసం చేసిందంటున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ను అవినీతిపరుడిగా చిత్రీకరించి, సోదరుడు జగన్మోహన్ రెడ్డిపై తప్పుడు కేసులు పెట్టి జైల్లో ఉంచిన కాంగ్రెస్ పార్టీతో షర్మిల ఎలా చేతులు కలుపుతారంటు నిలదీస్తున్నారు. జగన్ మీద కేసులు పెట్టి తల్లి, భార్యతో పాటు తనను ఫుట్ మీద ఆందోళనచేసేట్లుగా దిగజార్చిన కాంగ్రెస్ తో చేతులు కలపటం షర్మిల చేస్తున్న తప్పంటున్నారు.
ఇక మరో నేత గట్టు రామచంద్రరావు మాట్లాడుతూ తమ కుటుంబానికి కాంగ్రెస్ చేసిన ద్రోహాన్ని షర్మిల ఎలా మరచిపోయారని ప్రశ్నించారు. తమ కుటుంబానికి అన్యాయం చేసిన, ద్రోహం చేసిన కాంగ్రెస్ తోనే షర్మిల చేతులు కలపడం తమకు చాలా అవమానంగా ఉందన్నారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని తమతో షర్మిల చెబితేనే రెండేళ్ళుగా ఆమెతో నడుస్తున్నట్లు వీళ్ళు చెబుతున్నారు.
అలాంటిది తెరవెనుక జరిగిన ఒప్పందం ప్రకారమే షర్మిల నడుచుకుంటున్నట్లు వీళ్ళు మండిపోయారు. కాంగ్రెస్ లో విలీనం విషయం తమతో మాటమాత్రంగా కూడా చెప్పలేదని, అభిప్రాయం అడగలేదంటున్నారు. సో విషయం చూస్తుంటే కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్టీపిని విలీనం చేయటం పార్టీలో ఎవరికీ ఇష్టంలేదని అర్ధమవుతోంది. కాకపోతే షర్మిలకు ఒక అదృష్టముంది. అదేమిటంటే ఆమె పార్టీ జనాల్లో ఇంకా ఉనికి కూడా చాటుకోలేదు. ఉనికి చాటుకోవటానికే ఇబ్బందులు పడుతున్న షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి చేతులు దులుపుకోవాలని అనుకుంటున్నట్లున్నారు.