ఏపీలోని వైసీపీ ప్రభుత్వాధినేత, సీఎం జగన్ ప్రవేశ పెడుతున్న పథకాలు.. అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు.. వంటివి పరిశీలిస్తే.. అన్నీ కూడాదాదాపు మహిళల చుట్టూనే తిరుగుతున్నాయి.
అమ్మ ఒడి, వైఎస్సార్ భరోసా, డ్వాక్రా రుణాలు, జగనన్న ఇళ్లు.. ఇలాంటి వన్నీ కూడా.. మహిళల కేంద్రంగానే అమలు చేస్తున్నారు. ఇక, మహిళలను అక్కా-చెల్లి-అవ్వ అంటూ.. సీఎం జగన్ తరచుగా సంబోధిస్తున్నారు కూడా.
అయితే.. ఇదంతా కూడా పెద్ద వ్యూహంతోనే అమలు చేస్తున్నారనే విషయం తాజాగా వెల్లడైంది. ఊరక రారు.. అన్నట్టుగా.. సీఎం జగన్ ఏం చేసినా ఊరికే నే చేయరనేది ఇప్పుడు వాస్తవంగా మారింది.
తాజా విషయం ఏంటంటే.. ఏపీలో ఎవరెవరి ఓట్లు ఎన్ని ఉన్నాయనే విషయాన్ని తాజాగా ఎన్నికల సంఘం వెలువరించింది. దీనిలో మహిళా ఓటర్లు.. వారి ఓట్లే ఎక్కువగా ఉన్నాయని స్పష్టం చేసింది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో ముసాయిదా ఓటర్ల జాబితాను చీఫ్ ఎలక్ట్రోలర్ ఆఫీసర్ ముకేష్ కుమార్ మీనా ప్రకటించారు.
రాష్ట్రంలో 3,98,54,093 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. వారిలో 2,01,34,621 మంది మహిళా ఓటర్లు, 1,97,15,614 మంది పురుష ఓటర్లు ఉన్నారని స్పష్టం చేశారు. అంటే సుమారు 5 లక్షల మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు.
ఇది ఎన్నికలను ప్రభావితం చేస్తుందనేది తెలిసిందే. అందుకే సీఎం జగన్ పదే పదే మహిళల సెంట్రిక్‌గా రాజకీయాలు చేస్తున్నారనే వాదన ఉంది. ఇక, 68,115 సర్వీసు ఓటర్లు, 3,858 ట్రాన్స్ జెండర్ ఓటర్లు ఉన్నారని మీనా పేర్కొన్నారు. 18-19 ఏళ్ల వయసున్న ఓటర్ల సంఖ్య 78,438గా ఉన్నట్లు వెల్లడించారు.
నకిలీ ఓటర్లు, మృతులు, ఒకే పేరుతో వేర్వేరు చోట్ల నమోదైన ఓటర్లను ప్రత్యేక సాఫ్ట్వేర్ సాయంతో జాబితా నుంచి తొలగించినట్టు చెప్పారు. 10,52,326 మంది ఓటర్లను జాబితా నుంచి డిలీట్ చేశామని సీఈవో వెల్లడించారు. గతేడాది ఓటర్ల జాబితాతో పోలిస్తే ఈసారి 8,82,366 మంది ఓటర్లు తగ్గారని పేర్కొన్నారు.
ఓటరు కార్డు కోసం ఆధార్‌ను తప్పనిసరి చేయడం లేదని సీఈవో స్పష్టం చేశారు. అయితే, ఓటరు కార్డుతో ఆధార్ అనుసంధాన ప్రక్రియ ఇప్పటికే 60 శాతం మేర పూర్తయిందన్నారు. ఎమ్మెల్సీ పట్టభద్రులు, టీచర్ల ఓటర్ల నమోదు ప్రక్రియపై ఫిర్యాదులు వచ్చాయని, వీటిపై 19వ తేదీ వరకు విచారణ చేపడుతామని తెలిపారు.
సో.. మొత్తానికి సీఎం జగన్ చాలా ముందు చూపుతోనే.. మహిళలను తనవైపు తిప్పుకొనే ప్రయత్నాలు చేస్తుండడం గమనార్హం. అందుకే ఆయన ఎక్కడ ఎలాంటి కార్యక్రమం తెరమీదికి తెచ్చినా.. ఖచ్చితంగా మహిళలకే అమలు చేస్తున్నారు. ఏదేమైనా.. పొలిటికల్ మైండ్ సెట్లో చాలా దూకుడుగా ఉన్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.