కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ప్రమోటర్లుగా ఉన్న నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన 661 కోట్ల రూపాయల ఆస్తులను ఎన్ ఫోర్స్‌మెంటు డైరెక్టరేట్(ఈడీ) స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం జప్తు దశలో ఉన్న ఈ ఆస్తులను పూర్తిగా తామే స్వాధీనం చేసుకుంటామని పేర్కొంటూ.. ఈడీ సదరు ఆస్తులకు సంబంధించిన కార్యాలయా లు, భూములపై నోటీసులు అంటించింది. ప్రస్తుతం ఇవి జప్తు దశలో ఉన్నాయని.. నోటీసులకు స్పందించని పక్షంలో వీటిని స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేసింది.
ఢిల్లీ, ముంబై, యూపీ రాజధాని లక్నోలలో నేషనల్ హెరాల్డ్ పత్రికకు ఉన్న స్థిరాస్తులను స్వాధీనం చేసుకునేందుకు ఈడీ సిద్ధమైంది. అయితే.. వీటిని స్వాధీనం చేయడం ఇష్టం లేకపోతే.. ఆయా సంస్థల ద్వారా వచ్చే అద్దె, ఆదాయాలను తమకు బదిలీ చేయాలని నోటీసుల్లో పేర్కొనడం గమనార్హం. అంతేకాదు.. స్వాధీనాన్ని అంగీకరిస్తున్నట్టు అయితే.. 15 రోజుల్లోగా ఆయా సంస్థలను ఖాళీ చేసి.. తమకు అప్పగించాలని పేర్కొంది. లేకపోతే.. చట్టపరమైన చర్యలకు దిగి స్వాధీనం చేసుకుంటామని తెలిపింది. దీంతో ఇప్పుడు ఈ వ్యవహారం కాంగ్రెస్ పార్టీకి మరో తలనొప్పిగా మారింది.
ఏంటి విషయం?
`యంగ్ ఇండియా` అనేది స్వాతంత్ర్యం పూర్వమే స్థాపించిన సంస్థ. దీని ఆధ్వర్యంలో నేషనల్ హెరాల్డ్ పత్రిక.. ప్రచురితం అవుతోంది. ఇక, యంగ్ ఇండియా తర్వాత దశలో ‘యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్’ గా మారింది. దీనికి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ పార్టీలోని కొందరు అగ్రనేతలు.. ప్రమోటర్లు(వాటాదారులు)గా ఉన్నారు. అయితే.. నేషనల్ హెరాల్డ్ పత్రికకు కాంగ్రెస్ గతంలో పెట్టుబడులు పెట్టింది. ఇవి సుమారు 90 కోట్ల రూపాయల వరకు ఉన్నాయి. వీటిని వసూలు చేసుకునేందుకు యంగ్ ఇండియన్ ప్రయివేట్ లిమిటెడ్ ప్రయత్నించింది.
ఈ క్రమంలో మనీలాండరింగ్ జరిగిందన్నది ఈడీ చేస్తున్న ఆరోపణ. అంటే.. బ్లాక్ మనీని కాంగ్రెస్ పార్టీ.. పరోక్షంగా ఈ సంస్థకు ఇచ్చి.. వైట్‌గా మార్చుకుందని.. దీనికి విదేశీ ఖాతాలను వినియోగించిందన్నది కీలక అంశం. దీనిపై మోడీ హయాంలో కేసులు నమోదయ్యాయి. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ సహా.. పలువురిని విచారించారు కూడా. ఈ క్రమంలోనే 661 కోట్ల స్థిరాస్తులను ఈడీ జప్తు చేసింది. అయినప్పటికీ.. లావాదేవీలు చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఇక, ఇప్పుడు ఆ ఆస్తులను తామే స్వాధీనం చేసుకుంటామని ఈడీ పేర్కొంది. దీనిపై కాంగ్రెస్ పార్టీ స్పందించని పక్షంలో 15 రోజుల్లో ఆయా ఆస్తులను స్వాధీనం చేసుకునే అవకాశం ఈడీకి ఉంది.