రాజకీయాల్లో ప్రత్యర్థులపై కోపం ఉండొచ్చు. తమ అధికారానికి అడ్డు పడుతున్నారన్న కసి కూడా ఉండొచ్చు. ఆ రకంగా రాజకీయాల్లో పోరాటం చేసుకోవచ్చు. ప్రజలను మెప్పించి అధికారం తెచ్చుకోనూ వచ్చు. కానీ.. అధికారంలోకి వచ్చాక కూడా.. ప్రత్యర్థులపై ఉన్న కోపాన్ని.. ప్రజాధనంపై చూపిస్తే..? ప్రజలు కట్టిన పన్నులతో గత ప్రభుత్వాలు కొనుగోలు చేసిన సరుకులను నష్టపరిస్తే.. ? ఈ ప్రశ్నలకు సమాధానం జగన్! ఔను.. ఏపీ రాజధాని అమరావతి అంటే.. గిట్టని జగన్.. దీనిని తాను అధికారంలోకి వచ్చాక ఎంత కుంగదీయాలో అంతా చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రారంభించారనో.. లేక, తనకు వ్యక్తిగతంగా నచ్చలేదనో కారణంగా అమరావతిని తన ఐదేళ్ల పాలనలో జగన్ అస్సలు పట్టించుకోలేదు. అంతే కాదు.. మూడు రాజధానులంటూ.. ఆటలాడారు. అయితే.. ఈ ఐదేళ్ల కాలంలో అమరావతిని పట్టించుకోని కారణంగా.. ఇప్పటికే నిర్మాణాలు నీటిలో మునిగిపోయి.. చెట్లు చేమలు దట్టంగా పేరుకుపోయాయి. వీటిని శుభ్రం చేసేందుకు కూటమి సర్కారు 40 కోట్లు ఖర్చు చేసి.. నిర్మాణాల్లో పేరుకున్న నీటిని తొలగించింది.
ఇక, చెట్లు చేమలను తొలగించింది. కట్ చేస్తే..జగన్ చేసిన నష్టం అంతే కాదని.. మరింత ఉందని.. తాజాగా అధికారులు చెబుతున్నారు. నిర్మాణాలు బయటపడి.. నెమ్మదిగా పనులు ప్రారంభిస్తున్న సమయంలో అమరావతి కోసం.. గతంలో 2014-19 మధ్య చంద్రబాబు సర్కారు కొనుగోలు చేసి ఉంచిన సామగ్రి బయటకు వస్తోంది. కట్టల కొద్దీ సిమెంటు, టన్నుల కొద్దీ ఐరన్, ఇతర తలుపులు, వస్తువులు కూడా.. బయట పడుతున్నాయి. అయితే.. ఇవన్నీ చీకిపోయి.. గట్టకట్టుకుపోయి.. నాని నాని నాశనం అయ్యాయి.
తాజాగా సీఆర్డీఏ నిపుణులు ఇలా నష్టపోయిన సరుకు విలువను ఇంజనీర్లతో లెక్కకట్టిస్తే.. అప్పటి విలువ ప్రకారమే.. 150 కట్లరూపాయలకు పైగానే ఉందని అంచనా వేశారు. ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం.. ఇది 270 కోట్ల వరకు ఉంటుందని లెక్కలు వేశారు. ఇదంతా వృథానేని.. దీనిని తొలగించేందుకు మరికొంత ధనం అవసరం అవుతుందని అధికారులు చెబుతున్నారు. దీనిపై సీఎం చంద్రబాబు అసెంబ్లీలోనే ప్రస్తావించే అవకాశం ఉందని సమాచారం. ఏదేమైనా.. చంద్రబాబు పై కక్షతో జగన్ చేసిన వ్యవహారం చూసి అందరూ నోరెళ్ల బెడుతున్నారు. ఈ సామగ్రిని ఏ పోలవరం పనులకో.. ఇతర ప్రాజెక్టులకో వినియోగించి ఉంటే బాగుండేదని అంటున్నారు.