సాధారణంగా ఏ ప్రభుత్వమైనా పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు తహతహలాడుతుంటుంది. బడ్జెట్ లో కేటాయింపులు చేసి అన్ని రంగాలను బలోపేతం చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలని చూస్తుంటుంది. ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు బడ్జెట్ ప్రవేశపెట్టి…ప్రభుత్వ ఖర్చులను నిధులు మంజూరు చేయాలన్న ఆలోచనలో ఉంటుంది.
అందులోనూ కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతున్న సమయంలో ఏ రాష్ట్రమైనా పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టేందుకే మొగ్గుచూపుతుంది. కానీ, ఊరందరిదీ ఒక దారైతే ఉలికి పిట్టదొక దారి అన్న చందంగా తయారైంది సీఎం జగన్ నేతృత్వంలోని ఏపీ సర్కార్ పరిస్థితి. పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టకపోగా…మూడు నెలల ఖర్చుల కోసం మరోసారి థూథూ మంత్రంగా తాత్కాలిక బడ్జెట్ కోసం ఆర్డినెన్స్ తెచ్చింది జగన్ సర్కార్.
ఇలా తాత్కాలిక బడ్జెట్ లతో నెట్టుకురావడం జగన్ కు కొత్తేం కాదు. షార్ట్ కట్ బడ్జెట్ లతో ప్రజాస్వామ్య పద్దతులను తుంగలో తొక్కడం జగన్ కు వెన్నతోపెట్టిన విద్య. తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప పూర్తి స్థాయి బడ్జెట్ ను ఏ ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రి వాయిదా వేయరు. కానీ, జగన్ మాత్రం… బడ్జెట్ ను లైట్ తీసుకున్నట్టు కనిపిస్తోంది.
రెండేళ్ల కిందట.. సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను నాటి టీడీపీ సర్కార్ ప్రవేశపెట్టింది. ఆ తర్వాత ఆరు నెలలకు జగన్ సర్కార్ పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టింది. గత ఏడాది స్థానిక ఎన్నికల నేపథ్యంలో 3 నెలల ఖర్చుల కోసం గవర్నర్ సంతకంతో పనికానిచ్చేశారు జగన్. ఇక, కరోనా నెపంతో మరోసారి అలాగే పద్దుపై సంతకం పెట్టించుకున్నారు. అదైన ఆరు నెలల తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టారు.
ఈ సారి కూడా.. మార్చి చివరి వారం వచ్చినా ప్రభుత్వం బడ్జెట్ గురించి బెంగపడడం లేదు. జగన్ పుణ్యమా అంటూ వరుసగా మూడో ఏడాది కూడా పూర్తి స్థాయి బడ్జెట్ లేకుండానే… రాబోయే ఆర్థిక సంవత్సరంలోకి ఏపీ అడుగుపెడుతోంది.ఇలా వరుసగా మూడు సార్లు పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టని రాష్ట్రంగా ఏపీ రికార్డు క్రియేట్ చేసిందని, ఈ రకమైన సంప్రదాయానికి జగన్ తెర తీశారని ఆర్థిక నిపుణులు విమర్శలు గుప్పిస్తున్నారు.