అమరావతిలో అసైన్డ్ భూముల వ్యవహారంపై పెను దుమారం రేగుతోన్న సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఎం జగన్ రెడ్డి కక్ష పూరిత ధోరణితో సీఐడీ విచారణను ప్రేరేపించారని టీడీపీ నేతలు దుయ్యబడుతున్నారు. అసైన్డ్ భూముల వ్యవహారంలో ఫేక్ కేసులు నమోదు చేశారని ఆరోపిస్తున్నారు. అసలు తాము ఎస్సీ, ఎస్టీ కేసే పెట్టలేదని, తమతో సంతకాలు చేయించుకొని ఆ కేసు పెట్టారని ఫిర్యాదుదారులు స్వయంగా చెప్పడంతో వైసీపీ నేతల గుట్టురట్టయింది.
తమతో ఎవరూ బలవంతంగా భూములు రాయించుకోలేదని, ఇదే విషయాన్ని తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో కూడా చెప్పామని వారు అంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తుళ్లూరు పోలీస్స్టేషన్ తో పాటు రాయపూడి, ఉద్దండరాయునిపాలెంలో పలువురు రైతులను సీఐడీ విచారణ జరుపుతోంది.
ఈ నేపథ్యంలో సీఎం జగన్ పై టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు విమర్శలు గుప్పించారు. గతంలో పదో తరగతి పరీక్ష పేపర్లు ఎత్తుకెళ్లిపోయిన బుద్ధిని జగన్ రెడ్డి ఇంకా మార్చుకోలేదని అయ్యన్న పాత్రుడు ఎద్దేవా చేశారు. ఇచ్చిన మాట తప్పుతూ, మడమ తిప్పుతూ జగన్ ఫేక్ సీఎం అనిపించుకున్నాడని అయ్యన్నపాత్రుడు సెటైర్ వేశారు. అమరావతి రైతుల పేరుతో సీఐడీకి ఫేక్ ఫిర్యాదులు ఇచ్చి..జగన్ ఫేక్ సీఎం బిరుదు సార్థకం చేసుకున్నాడని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దర్యాప్తు చేస్తున్న పోలీసులు కూడా ఫేక్ ఏమో అని అనుమానం వ్యక్తం చేస్తూ చమత్కరించారు.
ప్రతిపక్ష నేతగా అమరావతిని స్వాగతించిన జగన్…సీఎం అయిన తర్వాత కుట్రలు చేస్తున్నాడని మండిపడ్డారు. వికేంద్రీకరణ అంటూ విద్వేషపు విషాన్ని జగన్ చిమ్ముతున్నారని, దానిని టీడీపీ జనం ముందు ఉంచిందని అన్నారు. ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా, ఎంత బెదిరింపులకు పాల్పడినా జగన్ రెడ్డి, ఆయన గ్యాంగ్ చెప్పేవన్నీ అవాస్తవాలేనన్నారు. అసత్యప్రచారాలే పునాదులుగా నిర్మించుకున్న అధికారం కూలిపోయే రోజు దగ్గరపడిందని వార్నింగ్ ఇచ్చారు.