రాష్ట్రంలో సంక్షేమ సర్కారును స్థాపించామని పదే పదే చెబుతున్న వైసీపీ అధినేత జగన్.. తనహయాం లో అనేక పథకాలు తీసుకువచ్చారనే వాస్తవమే. అయితే, ఆయా పథకాలు సమాజంలోని 15 శాతం మంది ప్రజలకు మాత్రమే దక్కుతున్నాయ నేది మరో నిజం. మరి మిగిలిన 85 శాతం మంది ప్రజల మాటేంటి? అనేది చూస్తే… రిక్త హస్తాలే కనిపిస్తున్నాయి. నిజానికి అందరికీ మేలు చేస్తేనే ఒక ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూలత ఏర్పడుతుంది.
కానీ, ఈ విషయంలో డబ్బులు పోయి.. శని పట్టుకున్న చందంగా పరిస్థితి మారిపోయింది. కొన్ని కొన్ని పథకాలను గమనిస్తే.. అందరికీమేలు చేసేవి ఉన్నాయి. గత టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన అన్న క్యాంటీన్లు.. అందరికీ ప్రయోజనం చేకూర్చాయి. ఇందులో ఒక వర్గానికి లేదా.. పేదలకు మాత్రమే అని కాకుండా.. యువతకు, నిరుద్యోగులకు, కార్మికులకు కూడా ఈ క్యాంటీన్లను సాంత్వన చేకూర్చాయి. వీటిని వైసీపీ ప్రభుత్వం ఎత్తేసింది.
అలాగే..పండుగలకు ఇచ్చే కానుకలు కూడా.. కేవలం రేషన్ కార్డు ఉన్న వారికే అయినప్పటికీ.. అన్ని రకాల కార్డు దారులకు వీటిని అందించారు. దీంతో అన్ని వర్గాల్లోనూ టీడీపీ మేలు చేసిందనే భావన ఏర్పడింది. ఎన్నికల్లో గెలుపు ఓటములను పక్కన పెడితే.. ఆయా పథకాలు టీడీపీని ప్రజల్లో అలా నిలబె ట్టేలా చేశాయి. ప్రస్తుతం అవి టీడీపీకి వెన్నుదన్నుగా కూడా ఉన్నాయి. ఇక, యువతకు నిరుద్యోగ భృతి కూడా ఇచ్చారు. ఇది కూడా అన్ని వర్గాల్లోని వారికి అందింది.
వైసీపీ హయాంలో ఉద్యోగాలు లేవు. పోనీ నిరుద్యోగ భృతి అయినా.. ఉందా? అంటే.. అది కూడా లేదు. ఈ పరిణామాలను గమనిస్తే.. వైసీపీ ఇలాంటి అందరికీ మేలు చేసే పథకాలను వదులుకుని ఏం సాధించిం ది? అనేది కీలక ప్రశ్న. రైతులకు మేలు చేస్తున్నామంటూ.. ఆర్బీకేలు ఏర్పాటు చేసినా.. అవి కొందరికే పరిమితం అవుతున్నాయనేది ఒక వాదన. ఎలా చూసుకున్నా.. ఇది వైసీపీకి మైనస్‌గానే మారింది. ఇక, మరోవైపు అప్పులు చేయడం తప్పడం లేదు. కానీ, ప్రజల్లో సింపతీ పాళ్లు మాత్రం కొందరి నుంచే వస్తుండడం గమనార్హం.