రాజన్న రాజ్యం స్థాపిస్తానంటూ.. రాజకీయాల్లోకి అడుగు పెడుతున్న వైఎస్ షర్మిలకు భారీ సెట్ బ్యాక్ ఎదురవుతోంది. ప్రస్తుతం తెలంగాణలో తటస్థంగా ఉన్న నాయకులు చాలా మంది ఉన్నారు. గతంలో అనే క పార్టీల్లో ఉన్నవారు.. తర్వాత.. రాజకీయంగా ఇబ్బందులు పడ్డవారు.. ఇప్పుడు తటస్థంగా ఉన్నారు.
వీరంతా ప్రత్యేకంగా రాజకీయ వేదిక కోసం ఎదురు చూస్తున్నారనడంలో సందేహం లేదు. మరి ఇప్పుడు వీరంతా ఎక్కడ ఉన్నారు? వైఎస్ కుమార్తె షర్మిల రాజకీయ వేదిక పెడుతున్న నేపథ్యంలో వీరంతా ముందుకు రావొచ్చుకదా? అనే ప్రశ్నలు వస్తున్నాయి.
చూద్దామని వచ్చేవారేనా?
అత్యంత అట్టహాసంగా ఖమ్మం వేదికగా నిర్వహిస్తున్న సంకల్ప యాత్రకు హైదరాబాద్ నుంచి బయల్దేరిన షర్మిలకు.. లోటస్ పాండ్ నుంచి పలువురు.. పలు ప్రాంతాల్లో స్వాగతాలు చెబుతున్నారు. దీంతో షర్మిల ఓపెన్ టాప్ కారులో నిలబడి వారికి అభివాదం కూడా చేస్తున్నారు. అయితే.. దీనిని మరింత దగ్గరగా చూస్తే.. అసలు విషయం తెలుస్తోంది. ఇలా వస్తున్నవారు.. షర్మిలకు జై కొడుతున్న వారు.. అంతా కూడా.. తాలూ తప్పల బ్యాచే అంటున్నారు పలువరు రాజకీయ పండితులు. కేవలం కొందరు యువకులు.. అందునా.. షర్మిలను చూద్దామని వచ్చేవారు మాత్రమే ఈ బ్యాచ్లో కనిపిస్తున్నారు తప్ప.. ప్రత్యేక రాజకీయ ఇంట్రస్ట్ ఎక్కడా కనిపించడం లేదని చెబుతున్నారు.
ఆగుదామనుకుని.. ఆగకుండానే!
వాస్తవానికి ఎల్ బీనగర్ జంక్షన్లో షర్మిల కొద్దిసేపు ఆగి మినీ ప్రసంగం చేయాలని అనుకున్నారు. కానీ.. అక్కడ ఎవరూ కనిపించలేదు. వచ్చిన వారు కూడా తక్కువ సంఖ్యలో ఉండడంతో ఆగకుండానే ముందుకు సాగిపోయారు. ఈ క్రమంలో అబ్దుల్లాపూర్ మెట్ వద్ద అయినా.. ఒకింత ఆగాలని ప్లాన్ చేసుకున్నా.. అక్కడకూ అభివాదాల వరకే ఆమె పరిమితమయ్యారు. ఇక, నల్గొండ జిల్లాలోని కీలకమైన జంక్షన్.. నకిరేకల్లోనూ ఇంతకు కొంచెం.. అన్నట్టుగా వచ్చినా.. ఆశించిన మేరకు మాత్రం జనాలు రాకపోవడం గమనార్హం.
అనిల్ అంచనాలు గల్లంతు!
నిజానికి షర్మిల కాన్వాయ్ వస్తుంటే.. ట్రాఫిక్కు తీవ్రస్థాయిలో అంతరాయం ఏర్పడుతుందని.. ముందుగానే ఏర్పాట్లు చేసుకోవాలని.. షర్మిల భర్త.. అనిల్ కుమార్.. పోలీసులను ముందుగానే అలెర్ట్ చేశారు. దీంతో పోలీసులు రోప్ పట్టుకుని రంగంలోకి దిగారు. అయితే.. షర్మిల రంగంలోకి దిగి రోడ్డెక్కాక.. అంత సీన్ లేదని తెలుసుకుని.. ఎవరి వారు సైలెంట్ అయ్యారు. ఇదీ షర్మిల ఖమ్మం టూర్ పరిస్థితి ఇది!!: