వైసీపీ అధ్యక్షడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా ఓ కార్తకర్తకు భరోసా కల్పించిన తీరు ఇప్పుడు వివాస్పదంగా మారింది. పార్టీ శ్రేణుల్లో ధైర్యాన్ని నింపవచ్చు. కానీ వారు చేసే తప్పులను సమర్థిస్తూ అధికారులపై కక్ష తీర్చుకోవడం పెద్ద తప్పు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జగన్ బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ2 నిందితుడిగా ఉన్న సునీల్ యాదవ్ ఫిర్యాదు మేరకు రెండ్రోజుల క్రితం పులివెందుల పోలీసులు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త పవన్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు.
వివేకా హత్య నేపథ్యంలో తెరకెక్కించిన `హత్య` చిత్రం కొద్ది రోజుల క్రితం విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో తనను, తన తల్లిని అవమానించేలా సన్నివేశాలు చిత్రీకరించారని.. వాటిని `వైఎస్ అవినాశ్ అన్న యూత్` పేరిట ఉన్న వాట్సాప్ గ్రూప్ లో అడ్మిన్ ఉన్న పవన్ కుమార్ వైరల్ చేస్తున్నారంటూ సునీల్ యాదవ్ ఆరోపించారు. ఈ మేరకు పులివెందుల పోలీస్ స్టేషన్‌కు వెళ్లి డీఎస్పీ మురళీనాయక్‌కు ఫిర్యాదు చేయడంతో.. పవన్ తో సహా ఐదుగురిపై కేసు నమోదు చేశారు.
ఈ క్రమంలోనే మూడు రోజుల క్రితం పవన్ కుమార్ ను అదుపులోకి తీసుకున్న పులివెందుల పోలీసులు.. కడప సైబర్ క్రైమ్ పీఎస్‌లో విచారణ చేశారు. అయితే నిన్న వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి పులివెందులలో పర్యటించారు. ఈ సందర్భంగా జగన్‌ను కలిసిన పార్టీ కార్యకర్త పవన్ కుమార్ విచారణ పేరుతో డీఎస్పీ, సీఐ తనను కొట్టారంటూ ఫిర్యాదు చేశాడు. అందుకు స్పందించిన జగన్ పవన్ ను ఓదార్చారు. `మూడేళ్లు ఓపిక పట్టు. ఈసారి అధికారం మనదే. అధికారంలోకి రాగానే ఆ డీఎస్పీ, సీఐతోనే నీకు సెల్యూట్ కొట్టిస్తా, అప్పటి వరకు ధైర్యంగా ఉండు` అంటూ సదరు కార్యకర్తకు జగన్ భరోసా కల్పించారని ప్రచారం సాగుతోంది. ఇప్పుడు ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. గత ఐదేళ్లలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోవడానికి కారణం జగన్ ఇటువంటి తీరును ప్రదర్శించడమే అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.