మాజీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఇటీవల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. రాజ్యసభ పదవితో పాటు వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ పదవులకు విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు. అయితే సాయి రెడ్డి పార్టీ వీడటంపై వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తొలిసారి స్పందించారు. గురువారం ఉదయం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్ మీట్ పాల్గొన్న జగన్.. కూటమి ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడ్డారు.
ఈ క్రమంలోనే సాయి రెడ్డి తో సహా వైసీపీని వీడి బయటకు వెళ్లిపోయిన నలుగురు ఎంపీలపై జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ` పోయే ప్రతి ఒక్కరికి ఒకటే చెబుతాను. రాజకీయాల్లో ఉన్న వారికి వ్యక్తిత్వం, విలువలు, విశ్వసనీయత అనేవి చాలా ముఖ్యం. క్యాడర్ కాలర్ ఎగరేసుకుని ఫలానా వ్యక్తి తమ నాయకుడని చెప్పుకోవాలి. అది ఎమ్మెల్యే అయినా ఎంపీ గురించి అయినా సరే.
రాజకీయాల్లో కష్టాలు ఎల్లకాలం ఉండవు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా అధికారం ఐదేళ్లు మాత్రమే ఉంటుంది. ఆ ఐదేళ్లు ఓర్చుకుంటే సరిపోతుంది. అంతే తప్ప భయపడో లేక మరో కారణం చేతనో రాజీపడితే క్యారెక్టర్ కు ఏం విలువుంటుంది. సాయిరెడ్డికైనా పార్టీ నుంచి బయటకి వెళ్ళిన మిగతా ముగ్గురు ఎంపీలకైనా అదే వర్తిస్తుంది. ప్రలోభాలు, భయంతో క్యారెక్టర్ తగ్గించుకోవద్దు` అంటూ జగన్ వ్యాఖ్యానించారు.
కాగా, వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ పదవులకు రాజీనామా చేసిన వేళ విజయసాయిరెడ్డి జగన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2029 ఎన్నికల్లో వైఎస్ జగన్ గారు భారీ మెజారిటీతో మరోసారి ముఖ్యమంత్రి కావాలని నిండు మనసుతో కోరుకుంటున్నాను అంటూ సాయిరెడ్డి ఆకాక్షించారు.