సినీ నటి కరాటే కల్యాణి, యూట్యూబ్ ప్రాంక్ స్టర్ శ్రీకాంత్ రెడ్డిల మధ్య వివాదం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. హైదరాబాదులోని ఎస్సార్ నగర్ పరిధిలోని మధురానగర్ లో వీరిద్దరూ గొడవపడి…నడిరోడ్డుపైనే కొట్టుకున్న ఘటన వైరల్ అయింది. ప్రాంక్ వీడియోల పేరిట మహిళలతో అసభ్య వీడియోలు చేస్తున్నారంటూ అతడిపై కల్యాణి దాడి చేశారు. యూసుఫ్‌గూడలోని ఓ బస్తీలో వీడియోలు చేస్తుండగా.. సినీ నటి కల్యాణి మరో ఇద్దరు కలిసి వచ్చి శ్రీకాంత్‌రెడ్డిపై దాడికి పాల్పడ్డారు.
తొలుత శ్రీకాంత్ రెడ్డిని కరాటే కల్యాణి చెంప దెబ్బ కొట్టడంతో మొదలైన గొడవ క్రమంగా ఒకరిపై ఒకరు దాడి చేసుకునే దాకా వెళ్లింది. వీరిద్దరూ ఒకరిపై మరొకరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్న వైనం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో, ఆ ఘటనపై శ్రీకాంత్ రెడ్డి స్పందించారు. మహిళలను కించపరిచేలా వీడియోలు చేస్తున్నావంటూ కల్యాణి తనను దూషించిందని, అయితే, సినిమాల్లో కల్యాణి చేసే సీన్లు మాత్రం బాగున్నాయా? అని తాను ప్రశ్నించానని తెలిపారు.
ఈ క్రమంలోనే తమ మధ్య గొడవ జరిగిందిని, తనను లక్ష రూపాయలివ్వాలని కల్యాణి డిమాండ్ చేసిందని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. డబ్బులు ఇవ్వకపోతే హైదరాబాదులో తిరగనివ్వనని, తనపై రేప్ కేసులు పెట్టిస్తానని బెదిరించిందని ఆరోపించారు. తనకు మహిళా సంఘాలతో మంచి పరిచయాలు ఉన్నాయని వార్నింగ్ ఇచ్చిందని అన్నారు. ఆ తర్వాత ఆమె పక్కనున్న ఒక వ్యక్తి రూ. 70 వేలు ఇచ్చి మ్యాటర్ సెటిల్ చేసుకోమని చెప్పాడని, తాను డబ్బులు ఎందుకివ్వాలని ప్రశ్నించినట్లు చెప్పారు.
ఆ తర్వాత ఆమె తనను కొట్టిందని, పక్కనున్న వాళ్లు కర్రలు తీసుకుని తనను కొట్టేందుకు యత్నించారని శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. బతుకు తెరువు కోసం తాను వీడియోలు చేస్తుంటానని, వీడియోలు చేయాలని అమ్మాయిలు తమ వద్దకు వస్తుంటారని చెప్పుకొచ్చారు. డబ్బులు తీసుకుని తాను వీడియోలు తయారు చేస్తుంటానని, తన వల్ల వీడియో ఎడిటర్, కెమెరామెన్ కు ఉపాధి లభిస్తోందని చెప్పారు.
తనను చంపేస్తానని బెదిరించిందని, కల్యాణి నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తాను ఎలాంటి తప్పు చేయలేదనే విషయాన్ని అందరికీ తెలియజేయాలనే ఈ వీడియోను విడుదల చేస్తున్నానని చెప్పారు.