ఏపీ ఎన్నికల ఫలితాలు వైసీపీ కి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి అఖండ మెజారిటీతో విజయం సాధించే దిశగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. మధ్యాహ్నం 3 గంటల వరకు వెలువడిన ఫలితాల ప్రకారం 45 మంది టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. జనసేన నుంచి ఏడుగురు అభ్యర్థులు విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి ఒకరు గెలుపొందారు. 92 స్థానాల్లో టీడీపీ, 14 స్థానాల్లో జనసేన, 7 స్థానాల్లో బీజేపీ లీడ్ లో ఉన్నాయి. వైసీపీ ఘోర పరాజయం దిశగా వెళుతూ కేవలం 9 స్థానాలకే పరిమితమైంది. వైసీపీ ఇంకా గెలుపు ఖాతా తెరవకపోవడం విశేషం.
రాజమండ్రి రూరల్ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి టిడిపి గెలుపు బోణి కొట్టారు. ఆ తర్వాత రాజమండ్రి అర్బన్ టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు రెండో విజయాన్ని అందించారు. వరుసగా ఏడోసారి గోరంట్ల బుచ్చయ్య చౌదరి విజయం సాధించారు. పాలకొల్లులో నిమ్మల రామానాయుడు హ్యాట్రిక్ విక్టరీ సాధించారు. వీరంతా 60 వేల పై చిలుకు మెజారిటీతో గెలుపొందడం విశేషం. ఉరవకొండలో పయ్యావుల కేశవ్ గెలుపొందారు .చింతలపూడిలో టిడిపి అభ్యర్థి రోషన్ కుమార్ విజయం సాధించారు.
సర్వేపల్లి లో కూడా టిడిపి అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విజయం దిశగా దూసుకుపోతున్నారు. తన చిరకాల ప్రత్యర్థి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పై సోమిరెడ్డి లీడ్ లో కొనసాగుతున్నారు. వరుసగా నాలుగు సార్లు ఓడిపోయిన సోమిరెడ్డి ఈసారి గెలుపు రుచి చూడడం దాదాపుగా ఖాయమైంది. ఏపీలోని 25 లోక్ సభ స్థానాలకుగాను 16 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు అధిక్యంలో కొనసాగుతున్నారు. వైసీపీ 4 లోక్ సభ స్థానాల్లో లీడ్ లో ఉంది. బీజేపీ అభ్యర్థులు రెండు స్తానాల్లో, జనసేన అభ్యర్థులు రెండు స్థానాల్లో లీడ్ లో ఉన్నారు.