వైసీపీ ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి(46) తుది శ్వాస విడిచారు. గత కొద్ది రోజులుగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. గత నెల 25న హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి న్యుమోనియా వ్యాధికి చికిత్స పొందుతూ ఇవాళ కన్నుమూశారు. నిన్న తెల్లవారుజాము నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో వెంటిలేటర్ పై ఆయనకు చికిత్స అందించారు. ఆయనను కాపాడేందుకు డాక్టర్లు అన్ని ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. దీంతో, నేడు మధ్యాహ్నం మృతి చెందారు. చల్లా భగీరథ రెడ్డి మృతిపై పలువురు వైసీపీ నేతలు, రాజకీయ వేత్తలు సంతాపం తెలుపుతున్నారు. చల్లా భగీరథ రెడ్డికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
భగీరథ రెడ్డి అంత్యక్రియలు రేపు (నవంబరు 3) కర్నూలు జిల్లా అవుకులో నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. దివంగత వైసీపీ నేత చల్లా రామకృష్ణారెడ్డి కుమారుడే భగీరథ రెడ్డి. ఎమ్మెల్సీగా ఉన్న చల్లా రామకృష్ణారెడ్డి మరణానంతరం ఆయన కుమారుడు భగీరథ రెడ్డికి జగన్ ఎమ్మెల్సీ పదవినిచ్చారు. భగీరథ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసి 2019లో తండ్రితో కలిసి వైసీపీలో చేరారు. దివంగత వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణా రెడ్డి కుమారుడే చల్లా భగీరథ రెడ్డి.
2020లో చల్లా రామకృష్ణా రెడ్డి మృతితో భగీరథ రెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం వచ్చింది. భగీరథ రెడ్డి 1976 ఆగస్టు 30న జన్మించారు. ఓయూ నుంచి MA పొలిటికల్ సైన్స్ చేశారు. 2020 డిసెంబర్ 31న చల్లా రామకృష్ణా రెడ్డి కరోనా బారినపడి మృతిచెందారు. ఆ తర్వాత ఈ ఏడాది మార్చిలో ఆయన కుమారుడైన భగీరథ రెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.