గన్నవరం నియోజకవర్గంలో కొద్దిరోజులుగా టీడీపీ మాజీ నేత, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వర్సెస్ వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు అన్న రీతిలో మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. రాబోయే ఎన్నికల్లో గన్నవరం వైసీపీ టికెట్ తనదే అని ఈ ఇద్దరు నేతలు ఎవరికి వారు కాన్ఫిడెంట్ గా ప్రకటనలు చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా గన్నవరం నుంచే పోటీ చేస్తానని వెంకట్రావు ఇప్పటికే ప్రకటించారు కూడా. అయితే, అధిష్టానం మాత్రం వంశీ వైపే మొగ్గుచూపుతోందని, అందుకే వెంకట్రావుకు ప్రాధాన్యత తగ్గించిందని టాక్ వచ్చింది.
ఈ క్రమంలోనే యార్లగడ్డ వెంకట్రావు త్వరలోనే టిడిపిలో చేరబోతున్నారని ముమ్మరంగా ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారానికి తగ్గట్లుగానే తాజాగా యార్లగడ్డ వెంకట్రావు….సీఎం జగన్ పై, వైసీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ అపాయింట్మెంట్ కోసం రెండేళ్లుగా ఎదురుచూస్తున్నామని, లేఖ రాసినా తనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని ఆరోపించారు. నిన్ను క్రాస్ రోడ్ లో వదలను అని జగన్ తనతో గతంలో అన్నారని, కానీ ఇప్పుడు తాను ఎక్కడ ఉన్నాను? పార్టీలో నా స్థానం ఏమిటి? నడిరోడ్డు మీద ఉన్నానా అన్న సందేహం వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
తన అనుచరులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన వెంకట్రావు రాబోయే ఎన్నికల్లో గన్నవరం నుంచి పోటీ చేస్తానని తేల్చి చెప్పారు. వంశీతో తనకు శత్రుత్వం లేదని, గత ఎన్నికల్లో పోటీ చేయడం వల్లే ప్రస్తుతం కూడా ఆయన ప్రత్యర్థిగా ఉన్నారని అన్నారు. ఆ కారణంతోనే వంశీతో కలిసి పని చేయలేనని గతంలోనే జగన్ కి చెప్పానని అన్నారు. తన డొక్క చించి డోలు కడతా అంటూ దుట్టా రామచంద్రరావు విమర్శించినా పార్టీ స్పందించలేదని, ఎన్ని అవమానాలు పడ్డా జగన్ ను పల్లెత్తు మాట అనలేదని అన్నారు. గన్నవరం టికెట్ కావాలని మరోసారి జగన్ ను కోరతానని, తన భవిష్యత్తును గన్నవరం ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు.