జగన్ సర్కారు అధికారంలోకి వచ్చాక ప్రవేశపెట్టిన వలంటీర్ల వ్యవస్థ మీద తెలుగుదేశం పార్టీ ఎంతగా విమర్శలు గుప్పించిందో తెలిసిందే. వలంటీర్ల ద్వారా కొన్ని మంచి పనులు జరిగినప్పటికీ.. వాళ్లు పూర్తిగా అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం.. ఆ పార్టీకి ప్రచారకర్తలుగా మారిపోవడం గురించి టీడీపీతో పాటు జనసేన కూడా ఎన్నో ఆరోపణలు, విమర్శలు గుప్పించాయి. ఎన్నికల టైంలో వాళ్లు పింఛన్ల పంపిణీ సహా ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉండేలా కోర్టుకు కూాడా వెళ్లారు.
ఐతే లక్షల సంఖ్యలో ఉన్న వలంటీర్లు, వారి కుటుంబాల్లో వ్యతిరేకత పెరిగితే మంచిది కాదని.. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇటీవల వారికి అనుకూలంగా మాట్లాడుతున్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా వలంటీర్లను కొనసాగిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.
తాజాగా వలంటీర్లను ఊరించే ప్రకటన చేశారు చంద్రబాబు. ప్రస్తుతం వలంటీర్ల గౌరవ వేతనం రూ.5 వేలు కాగా.. దాన్ని తాము అధికారంలోకి వచ్చాక రూ.10 వేలకు పెంచుతామని బాబు ఉగాది వేళ ప్రకటించారు. ఈ సందర్భంగా వలంటీర్ల వ్యవస్థను ఎట్టి పరిస్థితుల్లో తీసి వేయమని కూడా ఆయన స్పష్టం చేశారు. ఐతే ఈ ప్రకటన పట్ల తెలుగుదేశం, జనసేన వర్గాల నుంచే వ్యతిరేకత వస్తోంది.
వలంటీర్లు అన్న వాళ్లు వైసీపీ కార్యకర్తల మాదిరే అని.. ఇలా ఎన్ని ప్రకటనలు చేసినా వారి ఆలోచన మారదని.. టీడీపీకి అనుకూలంగా ఏమీ పని చేయరని వారంటున్నారు. వలంటీర్లను మెప్పించడానికి చేేసే ప్రయత్నం వృథా అని.. ఇన్నాళ్లూ ఆ వ్యవస్థ గురించి ఎన్నో విమర్శలు, ఆరోపణలు చేసి.. ఇప్పుడు వారికి అనుకూలంగా ప్రకటనలు చేస్తే ఏం ప్రయోజనం అని వారు వాదిస్తున్నారు.