మంచు ఫ్యామిలీలో రేగిన మంటలు ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి. మోహన్ బాబు, మంచు మనోజ్ ఇద్దరూ పరస్పర ఆరోపణలు చేసుకోవడమే కాకుండా, పోలీసులకు ఫిర్యాదు చేసే వరకు వెళ్లడంతో వివాదం మరింత ముదిరింది. తనకు, తన భార్య మౌనిక కు ప్రాణహాని ఉందని, గుర్తుతెలియని వ్యక్తులు తమపై దాడి చేశారని మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. మోహన్ బాబు నేరుగా తన కుమారుడి పైనే పోలీస్ కంప్లైంట్ ఫైల్ చేశారు.
మనోజ్ నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ రాచకొండ కమిషనర్ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ శివారు జల్పల్లి లోని మంచు టౌన్ లో ఉన్న తన నివాసాన్ని బలవంతంగా లాక్కునేందుకు మనోజ్, అతని భార్య మౌనిక ప్రయత్నిస్తున్నారని.. ఆ ఇంటి నుంచి తను శాశ్వతంగా బయటకు పంపించాలని చూస్తున్నారని మోహన్ బాబు ఆరోపణలు చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను మోహన్ బాబు కోరారు. కానీ ఇక్కడ చిన్న లాజిక్ మిస్ అవుతోంది. మంచి మనోజ్ ఇంటిని లాగేసుకున్నంత మాత్రాన చట్టపరంగా అతనిది అయిపోదు.
అలాగే ఆస్తుల పంపకాల విషయంలోనే మోహన్ బాబు మనోజ్ మధ్య వివాదం చెలరేగిందని ముందు నుంచి ప్రచారం జరుగుతుంది. మోహన్ బాబు సైతం ఆల్మోస్ట్ అదే ప్రమోట్ చేస్తున్నారు. కానీ తాజాగా మనోజ్ కొన్ని సంచలన విషయాలు బయట పెట్టాడు. అసలు గొడవ ఆస్తుల కోసం కాదని.. తానెప్పుడూ కుటుంబ ఆస్తులు అడగలేదని, ఒకవేళ అడుగుంటే నిరూపించమంటూ ఛాలెంజ్ విసిరాడు.
మోహన్‌బాబు యూనివర్సిటీ విద్యార్థులను, స్థానిక వ్యాపారులను మంచు విష్ణు, ఆయన అసోసియేట్ వినయ్ మహేశ్వరి దోపిడీ చేస్తున్నారు. ఎంబీయూ విద్యార్థులకు, స్థానికి వ్యాపారులకు నేను బహిరంగంగా మద్దతు పలికి మాట్లాడిన నేపథ్యంలోనే నా తండ్రి మోహన్ బాబు నాపై ఫిర్యాదు చేశారు. ఎంబీయూ లో చేస్తున్న అక్రమాలపై ప్రశ్నించినందుకే తనను వేధింపులకు గురి చేస్తున్నారు అని మనోజ్ వాపోయాడు. ఆర్థిక అవకతవకలకు సంబంధించి తన వద్ద ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు.
జల్పల్లి లోని ఇంటిని అక్రమంగా లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నామని తనపై, తన భార్యపై మోహన్ బాబు చేసిన ఆరోపణలు పూర్తిగా కల్పితమని మనోజ్ తెలిపారు. విష్ణు దుబాయికి వెళ్లడంతో, ఇంట్లో అమ్మ ఒంటరిగా ఉంటోందని.. మా నాన్న, అతని స్నేహితుల కోరితేనే ఆ ఇంటికి వెళ్లామని మనోజ్ వివరించాడు. అలాగే సొంత ప్రతిభ, శ్రమతో స్వతంత్రగా జీవిస్తున్నాను, కుటుంబ ఆస్తిపాస్తులపై ఆధారపడకుండా నా పిల్లలను పెంచుకుంటున్నాను.. అయినా కూడా ఈ వివాదంలోకి నా ఏడు నెలల కూతుర్ని లాగి తప్పుడు ఆరోపణలు చేయడం దారుణమని మోహన్ బాబుపై మనోజ్ మండిపడ్డారు. ఫ్యామిలీ ప్రాపర్టీని విష్ణు దుర్వినియోగం చేశాడు. స్వలాభం కోసం కుటుంబ పేరును వాడుకున్నాడు. అయినా కూడా నా తండ్రి అతనికే సపోర్ట్ చేశారని మనోజ్ ఆరోపణలు చేశాడు.