మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో అత్యధిక బడ్జెట్లో, భారీ అంచనాలతో మొదలైన సినిమా ‘విశ్వంభర’. ‘బింబిసార’ లాంటి బ్లాక్ బస్టర్‌తో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన వశిష్ఠ డైరెక్షన్లో మొదలైన మూవీ కావడం.. యువి క్రియేషన్స్ లాంటి పెద్ద సంస్థ ప్రొడ్యూస్ చేయడం.. ఇది ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ తరహా సినిమాలా కనిపించడంతో ‘విశ్వంభర’ మొదలైనపుడు మామూలు హైర్ రాలేదు. కానీ ఆ హైప్ అంతా టీజర్ రిలీజయ్యాక తుస్సుమంది. టీజర్లో విజువల్స్, ఎఫెక్ట్స్ అంత సాధారణంగా కనిపించాయి మరి.
ఈ దెబ్బతో సోషల్ మీడియాలో ఎక్కడలేని నెగెటివిటీ ముసురుకోవడంతో చిత్ర బృందం ఉక్కిరిబిక్కిరి అయిపోయింది. దెబ్బకు సినిమాను నిరవధికంగా వాయిదా వేసేశారు. కొత్త టీంను హైర్ చేసుకుని విజువల్ ఎఫెక్ట్స్ మీద మళ్లీ పని చేస్తున్నారు. ఐతే ఎంతకీ సినిమా ఒక కొలిక్కి రాకపోవడం, రిలజ్ గురించి సమాచారం లేకపోవడంతో మెగా ఫ్యాన్స్ అసహనానికి గురవుతున్నారు.
ఐతే ఎట్టకేలకు ‘విశ్వంభర’ టీం ఒక అప్డేట్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం. ఈ నెల 12న ‘విశ్వంభర’ తొలి పాటను రిలీజ్ చేయబోతున్నారట. ఇందుకోసం నందిగామలోని భారీ హనుమంతుడి విగ్రహ ప్రాంగణాన్ని వేదికగా ఎంచుకున్నారట. ఈ పాట లాంచ్‌తో పాటే రిలీజ్ డేట్‌ను కూడా అనౌన్స్ చేసే అవకాశాలున్నాయి. ఈ సినిమాను వేసవి రేసు నుంచి తప్పించిన విషయం స్పష్టం. చిరు బ్లాక్ బస్టర్ మూవీ ‘ఇంద్ర’ రిలీజైన జులై 24ను కొత్త డేట్‌గా అనుకుంటున్నట్లు సమాచారం. కొత్త టీంతో చేసిన విజువల్ ఎఫెక్ట్స్ పనులన్నీ ఒక కొలిక్కి వచ్చినట్లే అని అంటున్నారు. చిత్రీకరణ కూడా దాదాపు పూర్తయినట్లే. పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి కావడానికి ఇంకో రెండు నెలలకు పైగానే సమయం పడుతుంది. ఈలోపు మంచి ప్రమోషనల్ కంటెంట్ ఇస్తూ సినిమాకు తిరిగి హైప్ తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు.