వైసీపీలో నంబర్ టూగా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చాలాకాలం చక్రం తిప్పిన సంగతి తెలిసిందే. అయితే, గత ఏడాది కాలంగా వీసా రెడ్డికి బ్యాడ్ టైం నడుస్తోంది. చివరి నిమిషయంలో రెండో విడత రాజ్యసభ సభ్యుడిగా ఎంపికై హమ్మయ్యా అనుకున్న విజయసాయి…ఇటీవల లిక్కర్ స్కాంలో ఆయన అల్లుడు, వైఎస్ భారతి పేర్లు రావడంతో మళ్లీ ఇరకాటంలో పడ్డారు. ఈ క్రమంలోనే తాజాగా విజయసాయికి జగన్ మరో షాకిచ్చారు.
ఆల్రెడీ విజయసాయి దగ్గర నుంచి ఒక్కొక్కటిగా పదవులు పీకేస్తున్న జగన్…తాజాగా సోషల్ మీడియా విభాగాన్ని కూడా ఆయన నుంచి లాగేసుకున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి సోషల్ మీడియా విభాగాన్ని పర్యవేక్షిస్తున్న విజయసాయికి ఇది భంగపాటే. ఇటీవల సోషల్ మీడియా విభాగంలో చేపట్టిన కొత్త నియామకాల కార్యక్రమానికీ కూడా విజయసాయిని ఆహ్వానించలేదు. సర్వం సజ్జలే చూసుకోవడంతో విజయసాయి కూడా సైలెంట్ అయ్యారు.
ఇక, తాజాగా ఆ సోషల్ మీడియా విభాగం బాధ్యతలను సజ్జల తనయుుడు భార్గవ్ కు అప్పగించారు. తనకు ప్రాధాన్యత తగ్గడంతో విజయసాయి తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో కూడా పెద్దగా కనిపించడం లేదట. మామూలుగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే విజయసాయి…ఈ మధ్య కాలంలో వైసీపీ సోషల్ మీడియా పోస్టుల్ని కూడా తక్కువ షేర్ చేస్తున్నారు. జగన్, భారతిలను పొగిడేందుకు..కొన్ని సందర్భాల్లో మాత్రమే ట్వీట్ చేస్తున్నారు.
అయితే, చాలాకాలం నుంచి విజయసాయిపై జగన్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని,అయితే, వైఎస్ భారతి దగ్గర మార్కులు కొట్టేసిన విజయసాయి…జగన్ దగ్గర ఎలాగోలా నెట్టుకొస్తున్నారని టాక్. అయితే, తాజాగా ఢిల్లీ లిక్కర్ స్కాంలో విజయసాయిరెడ్డి, ఆయన అల్లుడు, భారతిల పేర్లు రావడంతో జగన్ ఆగ్రహంతో ఉన్నారట. అందుకే, సోషల్ మీడియా ఇన్ చార్జిగా ఆయనను తొలగించారట. ఏది ఏమైనా, సజ్జల వల్లే విజయసాయికి తాడేపల్లి ప్యాలెస్ తలుపులు మూసుకుపోయినట్లేనని అంటున్నారు.