శనివారం సాయంత్రం ఉత్తర కాలిఫోర్నియా లోని మిల్పిటాస్ నగరంలో యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్ర వారి డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి భవనంలో సిలికానాంధ్ర నిర్వహించిన శోభకృత్ నామ ఉగాది ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.
అంచనాలను మించి హాజరైన తెలుగువారితో, ఆద్యంతమూ సభికుల ఈలలతో, చప్పట్లతో ఉగాది పండుగ సంబరంగా జరిగింది.
కార్యక్రమం బ్రహ్మశ్రీ మారేపల్లి నాగవేంకటశాస్త్రిగారి వేదపఠనంతో మొదలయింది.
ఆ తరువాత ఈ కొత్తసంవత్సరంలో రాబోయే ఫలితాలను తమ పంచాంగపఠనంతో వివరించారు.
ప్రముఖ టాక్ షో హోస్ట్ కిరణ్ ప్రభ సంచాలకత్వంలో ప్రాంతీయ తెలుగుకవుల స్వీయ కవితాపఠనం జరిగింది.
ఆయన గత 21 సంవత్సరాలుగా నిరాఘాటంగా సిలికానాంధ్ర చేస్తున్న ఈ ఉగాది కవి సమ్మేళనాల దృశ్యమాలికని ప్రదర్శిస్తూ తమ కవితని వినిపించారు.
శ్రీమతి పద్మావతి గారి, “I am confused” మరియు మధుప్రఖ్య గారి “Work from home ” కవితలు ప్రేక్షకులతో చప్పట్లు కొట్టించాయి.
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన రచయిత, ద్విభాషా పండితుడు, పూర్వ రాజ్యసభ సభ్యులు, పద్మశ్రీ, పద్మభూషణ్ బిరుదాంకితుడు డా. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ (YLP) గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా, భారత కాన్సులేట్ జనరల్ డా. టి. వి. నాగేంద్రప్రసాద్ గారు విశిష్ట అతిధిగా, మిల్పిటాస్ నగర మేయర్ కార్మెన్ మోంటానో ఆత్మీయ అతిధిగా విచ్చేశారు.
ముందుగా కాన్సుల్ జనరల్ ప్రవాసాంధ్రులకు ఉగాది శుభాకాంక్షలను తెలియజేస్తూ భారత కాన్సులేట్ ప్రవాసీయుల కోసం చేస్తున్న కార్యక్రమాలను వివరించారు.
ఆ తరువాత సిలికానాంధ్ర ప్రస్తుత, మరియు పూర్వ అధ్యక్షులు, ప్రస్తుత కార్యవర్గ సభ్యులందరూ, డా. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ దంపతులను వేదిక మీదకు తీసుకువచ్చి , ఘన సన్మానం చేసి, “సిలికానాంధ్ర గ్రంథ పయోనిధి” అన్న బిరుదును, సన్మాన పత్రాన్ని అందించారు.
డా. యార్లగడ్డ తమ జీవిత కాలంలో సేకరించిన 14,000 వేల పుస్తకాలన్నిటినీ యూనివర్సిటీ లైబ్రరీకి బహూకరించడమే కాక, వారి ఇద్దరు పిల్లలు యూనివర్సిటీకి చెరో $20,000 విరాళాన్ని కూడా ప్రకటించారు. ఉగాది ఉత్సవానికి ముందు, ఆ సాయంత్రం కాన్సుల్ జనరల్ చేతుల మీదుగా, డా. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ పేరిట యూనివర్సిటీ లైబ్రరీ ని లాంఛనంగా ఆవిష్కరించారు.
సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు డా.ఆనంద్ కూచిభొట్ల యార్లగడ్డ గారితో తన అనుబంధాన్ని పంచుకుంటూ, ఇటు సాహిత్యం, అటు రాజీకీయం రెంటినీ తమ ఒరలో అలవోకగా అమర్చుకున్న అరుదైన వ్యక్తిగా వారిని అభివర్ణించారు.
డా. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ అందరకీ ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ ఈ పుస్తకాలన్నిటినీ ఏమి చెయ్యాలో పాలుపోక గత కొద్దికాలంగా మదనపడుతున్నానని, చివరకు సిలికానాంధ్ర యూనివర్సిటీ వాటికి సరైన చోటని నిర్ణయించుకున్నానని, యూనివర్సిటీ యంత్రాంగం ఆమోదించడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్తూ తమ నిరాడంబరతని చాటుకున్నారు.
మిల్పిటాస్ నగర మేయర్, వైస్ మేయర్, మరియు ఇతర నగరపాలక సంస్థ సభ్యులు నగరం తరపున యూనివర్సిటీకి ఒక కమెండేషన్ ను సమర్పించారు.
ఆ తరువాత “గళమురళి” గా ప్రసిద్ధుడైన డా. కొమరవోలు శివప్రసాద్ (ఈలపాట శివప్రసాద్) గారి కచ్చేరి సభికులను మంత్రముగ్ధులను చేసింది.
కేవలం ఈల తో త్యాగరాయ, అన్నమాచార్య కీర్తనలు పాడుతుంటే సభికులు ఆశ్చర్యపోయారు.
వారికి స్థానిక వయోలిన్ వాద్యకారులు మాడుగుల శశిధర్ అద్భుతమైన సహకారాన్ని అందించారు.
గిన్నిస్ ప్రపంచరికార్డ్ సాధించిన వీణాపాణి గారు తాను ప్రయోగం చేసిన 72 మేళకర్త రాగాల సూక్ష్మీకరణ రూపమైన స్వర బీజాక్షరిని ఆహూతులకు పరిచయం చేశారు.
అలానే అమోఘ్ కూచిభొట్ల మృదంగం పైన, ప్రమితి కల్లూరి వీణ తో వీరిరువురికీ సహకారం అందించారు. శనివారం ఉదయం 230 మంది పిల్లలు, 5 విభాగాల్లో పాల్గొన్న భాషావికాస పోటీల్లో విజేతలైన వారికి బహుమతి ప్రధానం చేశారు.
ఈ సభ విజయవంతం అవ్వడానికి కృషి చేసిన సిలికానాంధ్ర కార్యవర్గ సభ్యులు కందుల సాయి, సంగరాజు దిలీప్, పరిమి శివ, సింహాద్రి కిరణ్, ఉద్దరాజు నరేంద్ర, తనారి గిరి, కోట్ని శ్రీరాం లకు కార్యదర్శి వేదాంతం మహతి కృతజ్ఞతలు తెలిపారు.
పదహారణాల తెలుగు భోజనం తో పాటు సిలికానాంధ్ర వారు ప్రతి ఒక్కరికీ అందజేసిన కవితాతాంబూలంతో ఉత్సవం పూర్తయింది.