ఇవాళ ఎన్టీఆర్ జయంతి. ఈ సందర్భంగా ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఎన్టీఆర్ ఘాట్ కు టీఆర్ఎస్ శ్రేణులు చేరుకుని మహానాయకుడికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఈ దేశానికి ప్రధాని కావాల్సిన నేత ఆయన అని టీఆర్ఎస్ ముఖ్య నాయకులు కీర్తించడం విశేషం. రానున్న ఎన్నికల దృష్ట్యా ఈ పరిణామం జరిగినా కూడా ! ఇది ఒక మంచి పరిణామమే అని పరిశీలకులు అంటున్నారు.
ఇప్పటిదాకా ఎన్టీఆర్ ను ఓ సమైక్య వాదిగా భావించిన కేసీఆర్ వర్గం ఇప్పుడు తన పంథా మార్చుకుని ఎన్టీఆర్ కు నివాళి ఇవ్వడం ఓ కీలక మలుపు. ఓ విధంగా ఇది రేవంత్ రెడ్డి వర్గానికి చెక్ పెట్టేందుకు చేసిన పని అని ఇంకొందరు అంటున్నారు. వాస్తవానికి ఎన్నికలు సమీపిస్తున్నందున గతం కన్నా వేగంగా కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటోంది. రేవంత్ హయాంలో కొన్ని సామాజికవర్గాలు టీడీపీకి అనుకూలంగా ఉన్న సామాజికవర్గాలు కాంగ్రెస్ కు దగ్గరయ్యే ఛాన్స్ ఉంది.
దీనిని నిలువరించేందుకు కేసీఆర్ వేసిన ఎన్నికల ఎత్తుగడ ఇది అని ప్రధానంగా వినిపిస్తోన్న విశ్లేషణ. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అన్నది తెలంగాణలో పెద్దగా లేదు. కానీ ఆంధ్రులు ముఖ్యంగా కమ్మ సామాజికవర్గంకు చెందిన ఆంధ్రులు ఎక్కువగా ఉన్నారు. సెటిలర్ల రూపంలో ఉన్నారు. సెటిలర్ల ఓట్లే ఎప్పుడు ఎన్నికలు జరిగినా కీలకం. గ్రేటర్ ఎన్నికలు మొదలుకుని సార్వత్రిక ఎన్నికల వరకూ వారే కీలకం.
వారిని ఆకట్టుకునేందుకు, వారి ఆదరణ దక్కించుకునేందుకు కేసీఆర్ ఈ విధంగా తన పార్టీకి చెందిన ముఖ్య నాయకులను ఎన్టీఆర్ ఘాట్ కు పంపించి ఉంటారని తెలుస్తోంది. ఎన్టీఆర్ కు నివాళి ఇచ్చిన వారిలో మల్లారెడ్డి, నామా నాగేశ్వర్, మోత్కుపల్లి వంటి లీడర్లు ఉన్నారు.