ఈ దొంగ ఇస్పెషల్. రోటీన్ కు భిన్నంగా వ్యవహరించే ఇతగాడి తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అప్పుల ఇబ్బందులకు తాళలేక తాను దొంగతనం చేస్తున్నట్లుగా పేర్కొన్న ఈ దొంగ ఉదంతం సోషల్ మీడియాలోనూ చర్చగా మారింది. మధ్యప్రదేశ్ లోని ఖర్గోన్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే..
ఈ ఊళ్లోని ఒక షాపులో అర్థరాత్రి వేళ దొంగతనం జరిగింది. బ్యాగ్ లో ఉంచిన దానిలో రూ.2.45 లక్షలు మాత్రమే తీసుకెళ్లాడు. ఎందుకంటే.. ఇదే బ్యాగులో మొత్తం రూ.2.84 లక్షలు ఉన్నా.. కొంత మొత్తాన్ని వదిలేసి తనకు అవసరమైన మొత్తాన్ని మాత్రమే తనతో తీసుకెళుతున్నట్లుగా పేర్కొన్నారు. తన దొంగతనం గురించి ఒక టైప్ చేసిన లెటర్ ను అందులో భద్రపర్చడాడు.
తాను దొంగతనం చేయాలని తాను అనుకోలేదని.. మరో మార్గం లేకనే తాను చోరీ చేసినట్లుగా పేర్కొన్నారు. ‘నేను ఈ ప్రాంతం వాడిని కాదు. దూరంగా ఉంటాను.కొంతకాలంగా అప్పుల వారి వేధింపులు ఎక్కువ అయ్యాయి. అందుకే దొంగతనం చేయాల్సి వచ్చింది. రామనవమి రోజున చోరీకి పాల్పడినందుకు క్షమాపణలు’’ అని లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు.. తాను దొంగతనం చేయాలని అస్సలు అనుకోలేదని.. వేరే మార్గం లేకుండా పోయిందన్నారు.
తనకు అవసరమైనంత డబ్బే తాను తీసుకున్నానని.. డబ్బులు తీసుకెళ్లటం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. తాను తీసుకెళ్లిన డబ్బుల్ని ఆర్నెల్లలో తిరిగి ఇచ్చేస్తానని పేర్కొన్నారు. ఈ లేఖను సదరు యజమాని పోలీసులకు అందజేశారు. దొంగను వెతికి పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.