ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగు మీడియా రంగంలో పవర్ ఫుల్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాక్రిష్ణ అలియాస్ ఆర్కే మాత్రమే. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తాను సపోర్టు చేసిన పార్టీలే ప్రభుత్వంలో ఉండే విషయంలో కీలక భూమిక పోషించారని చెప్పాలి. అలాంటి ఆయన.. తాజాగా తన వీకెండ్ కామెంట్ లో రేవంత్ సర్కారును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు.. ఇచ్చిన సూచన చూసిన తర్వాత.. ఇప్పుడేం జరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
హైడ్రా విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి.. ఓపెన్ గానే ‘జర జాగ్రత్త రేవంత్’ అన్న మాటను చెప్పేయటం ద్వారా.. ఆయన పరిస్థితి ఏ మాత్రంబాగోలేదన్న విషయాన్ని చెప్పేశారు. అంతేకాదు.. హైడ్రా.. మూసీ వ్యవహారాల్లో రేవంత్ సర్కారు అనుసరించిన విధానాలపై ఆయన సైతం గుర్రుగా ఉన్నట్లుగా ఆయన రాసింది చదివినప్పుడు ఇట్టే అర్థమవుతుంది.
ఇంతకూ ఆయన ఏం చెప్పారు. దాదాపు ముప్పాతిక పేజీలో రాసిన రాతల్ని సింగిల్ లన్ లో చెప్పాలంటే ఏం చెబుతారు? అంటే.. ‘‘మూసీ విషయంలో ముందుకు వెళ్లొద్దు.. హైడ్రా పేరుతో హడావుడి చేయొద్దు’’ అన్న విషయాన్ని సూటిగా.. సుత్తి లేకుండా చెప్పేశారని చెప్పాలి. రేవంత్ తక్షణం ‘‘హైడ్రా కూల్చివేతలకు తాత్కాలికంగా విరామం ప్రకటించాలి. ప్రభుత్వం తలపెట్టిన మూసీ ప్రాజెక్టును తాత్కాలికంగా పక్కన పెట్టడం వాంఛనీయం’ అన్న అక్షరాల్ని హైలెట్ చేసి మరీ చెప్పేయటం చూస్తే.. ప్రభుత్వానికి ఆయన డేంజర్ బెల్ మోగించారనే చెప్పాలి.
హైడ్రా కూల్చివేతల విషయంలో ప్రజాభిప్రాయాన్ని పక్కాగా సేకరించిన తర్వాత.. విధివిధానాల్ని పక్కాగా సెట్ చేసిన తర్వాతే ఆ విషయంలో ముందుకు వెళ్లాలని.. లేదంటే మొదటికే మోసం వస్తుందన్న విషయాన్ని తనదైన శైలిలో హెచ్చరించారని చెప్పాలి. అంతేకాదు.. రేవంత్ ప్రభుత్వం అంటే కూల్చివేతల ప్రభుత్వం అన్న పేరును తెచ్చుకోవద్దన్న మాట ఆయన అక్షరాలు చెప్పేస్తున్నాయి. హెచ్చరికలతో కూడిన ఈ సూచనలను ముఖ్యమంత్రి రేవంత్ పట్టించుకుంటారో లేదో వేచి చూద్దామన్న మాటను చెప్పిన తీరు చూసిన తర్వాత.. ఆయన సైతం హైడ్రా కూల్చివేతల విషయంలో సానుకూలంగా లేరన్న విషయం ఇట్టే అర్థమవుతుంది.
అంతేకాదు.. సీఎం రేవంత్ భాష మీదా.. నిర్ణయాల మీదా కొన్ని సూచనలు చేశారు. ప్రజాభిమానం పొందేలా నిర్ణయాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలే కానీ.. ఇద్దరు ముగ్గురు వ్యక్తులను లక్ష్యంగా చేసుకొని నిర్ణయాలు తీసుకుంటే ఏ మాత్రం మంచిదికాదన్న విషయాన్ని చెప్పేశారు. వ్యక్తులు టార్గెట్ గా ప్రభుత్వాన్ని నడిపితే ఫలితం ప్రతికూలంగా ఉంటుందన్న విషయాన్ని చెప్పేసిన సదరు మీడియా యజమాని దమ్ము ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ గా మారింది. మరి.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రీతిలో రియాక్టు అవుతారన్నది అసలు ప్రశ్న.