ఎవరు అవునన్నా కాదన్నా… ఎక్కువ కాలం పాలించిన వారికి ప్రజల్లో వ్యతిరేకత రావడం సర్వసాధారణం. అయితే, అధికారం తలకెక్కినపుడు ప్రజల్లోనే కాదు, పార్టీలోనూ అసంతృప్తి మొగ్గ తొడగవచ్చు, అది వికసించి విస్తరించవ్చు. ఇపుడు టీఆర్ఎస్ పరిస్థితి అదే అంటున్నారు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.
తెలంగాణలో హుజూరాబాద్ ఉప ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుపై తిరుగుబాటు ప్రారంభమవుతుందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) అధ్యక్షుడు హోదాలో ఎంపీ ఎ. రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేస్తు ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇది మీడియా వర్గాల్లో తర్వాత రాజకీయ వర్గాల్లో వేగంగా చర్చకు దారితీసింది.
గుజరాత్ రాష్ట్రంతో పాటు ఆగస్టు 2022 లో తెలంగాణ రాష్ట్రం కూడా మధ్యంతర అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటుందని రేవంత్ అంచనా వేశారు. అసంతృప్తిని అణగదొక్కేందుకు కేసీఆర్ మధ్యంతర ఎన్నికలకు వెళ్తాడని… ఆ నిర్ణయమే కేసీఆర్ కు శాపం అవనుందని వ్యాఖ్యానించారు రేవంత్ రెడ్డి.
రాష్ట్ర మంత్రి, కేసీఆర్ అల్లుడు హరీష్ రావు గురించి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు రేవంత్. హరీష్‌ని రాజకీయాల నుంచి పంపించేందుకు సీఎం కేసీఆర్ ప్రణాళిక రూపొందించారని ఆయన పేర్కొన్నారు. పార్టీలో రాబోయే తిరుగుబాటును కేసీఆర్ ఇప్పటికే అంచనా వేశారని అన్నారు. దానిని ఎదుర్కొనేందుకు సిఎం కెసిఆర్ సన్నాహక సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారని వ్యంగాస్త్రాలు వేశారు.
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తన మిత్రపక్షం AIMIM పార్టీ సహాయంతో బీజేపీని బలోపేతం చేయడానికి సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీలను కుక్కలు మరియు నక్కలతో పోల్చడాన్ని ప్రస్తావిస్తూ, కేసీఆర్ ఫ్రస్ట్రేషన్లో నుంచి వచ్చిన మాటలే అవి… అతనిలో భయానికి, నిరాశకు నిదర్శనమే ఆ వ్యాఖ్యలు అన్నారు.