టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఇటీవల అంతర్జాతీయ టీ20లకు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. టీ20 ప్రపంచ కప్ విజయం తర్వాత జడ్డూ తన రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ క్రమంలోనే తాజాగా జడేజా కొత్త ఇన్నింగ్స్ ఆరంభించాడు. తాజాగా ప్రధాని మోడీ సమక్షంలో రవీంద్ర జడేజా బీజేపీ తీర్థం పుచ్చుకున్నాడు. తన భార్య, బీజేపీ ఎమ్మెల్యే రివాబాతో కలిసి మోదీ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఆ ఫొటోను రివాబా జడేజా సోషల్ మీడియాలో షేర్ చేశారు.
తన భర్త రవీంద్ర జడేజా బీజేపీ సభ్యత్వ నమోదు కార్డు తీసుకున్నారని తెలిపారు. 2019లో బీజేపీలో చేరిన రివాబా 2022 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో జామ్ నగర్ ఉత్తర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ సందర్భంగా రివాబా తరఫున రవీంద్ర జడేజా కూడా ప్రచారం చేశారు. ఈ క్రమంలోనే తాజాగా జడేజా కూడా బీజేపీలో చేరారు. గుజరాత్ నుంచి రాబోయే ఎన్నకల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి జడ్డూ పోటీ చేసే అవకాశముందని తెలుస్తోంది. లోక్ సభ ఎంపీగా ఆయన బరిలోకి దిగుతారని ప్రచారం జరుగుతోంది.
అయితే, జడ్డూను రాజ్యసభకు పంపుతారు అని ఇంకో టాక్ నడుస్తోంది. మరోవైపు, రవీంద్ర జడేజా ఇప్పటివరకు 72 టెస్టుల్లో 3,036 పరుగులు, 294 వికెట్లు సాధించాడు. వన్డేల్లో 197 మ్యాచ్లు ఆడి, 2,756 పరుగులు, 220 వికెట్లు తీశారు. టీ20ల్లో 74 మ్యాచ్లలో 515 పరుగులు, 54 వికెట్లు పడగొట్టారు.