వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విభేదించి.. బహిరంగంగా విమర్శిస్తూ.. కంట్లో నలకలా మారి తెగ ఇబ్బంది పెట్టిన రఘురామ క్రిష్ణం రాజు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జగన్ పార్టీలోనే ఉంటూ..చివరి వరకు ఆయన్ను నీడలా ఫాలో అయి.. ఆయనపై డైలీ బేసిస్ లో వెంటాడిన ఆయన.. అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగి ఎమ్మెల్యేగా గెలుపొందటం తెలిసిందే. మాజీ ముఖ్యమంత్రిగా మారిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తొలి కేసు నమోదు కావటం ఒక ఎత్తు అయితే.. హత్యాయత్నం లాంటి తీవ్రమైన సెక్షన్ల కింద ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ సీఎం జగన్ తో పాటు మరో నలుగురు సీనియర్ అధికారులపైనా కేసు నమోదు చేశారు.మరికొందరు ఉన్నారు. ఈ వ్యవహారంలో కేసుల్ని ఎదుర్కొంటున్న కీలక అధికారులు ఎవరెవరంటే?
ఏ1: పీవీ సునీల్ కుమార్ (సీబీడీ మాజీ అధిపతి)
ఏ2: పీఎస్ఆర్ ఆంజనేయులు (నిఘా విభాగం మాజీ అధిపతి)
ఏ3: వైఎస్ జగన్మోహన్ రెడ్డి (ఏపీ మాజీ సీఎం)
ఏ4: ఆరన విజయ్ పాల్ (సీఐడీ అదనపు ఎస్పీ)
ఏ5: డాక్టర్ ప్రభావతి (నాటి గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్)
2021 మే పద్నాలుగున రాజద్రోహం కేసులో తనను అరెస్టు చేసిన ఏపీసీఐడీ అధికారులు.. రాత్రంతా కస్టడీలో నిర్బంధించి చంపేందుకు ప్రయత్నించారంటూ రఘురామ ఇటీవల ఇచ్చిన ఫిర్యాదుపై న్యాయవర్గాలను సంప్రదించిన గుంటూరు పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు. నరసాపురం ఎంపీగా తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితుడు.. తాజా ఎన్నికల్లో ఉండి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న రఘురామ తాజా ఫిర్యాదులో ఏముంది? అందులో ఏమేం అంశాలు ఉన్నాయి? అన్న విషయాల్లోకి వెళితే..
– మూడేళ్ల క్రితం అప్పట్లో నరసాపురం ఎంపీగా ఉన్నప్పుడు నా మీద ఏపీ సీఐడీ అధికారులు రాజద్రోహం కేసు పెట్టారు. ఆ కేసులో భాగంగా హైదరాబాద్ లోని ఇంట్లో నన్ను అదుపులోకి తీసుకున్నారు.
– నిబంధనల ప్రకారం అక్కడి జడ్జి ఎదుట హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్ తీసుకుని రావాల్సి ఉండగా ఆ నిబంధన పాటించలేదు. వైద్య పరీక్షలు చేయించలేదు.
– బలవంతంగా పోలీసు వాహనంలోకి ఎక్కించి హైదరాబాద్ నుంచి నేరుగా గుంటూరులోని సీఐడీ కార్యాలయానికి రాత్రి తొమ్మిదిన్నర గంటలకు తరలించారు.
– ఆ రాత్రంతా అక్కడే ఒక రూంలో ఉంచేశారు. సునీల్ కుమార్.. సీఎస్ఆర్ ఆంజనేయులు సీఐడీ ఆఫీసుకు వచ్చారు. రబ్బర్ బెల్ట్.. లాఠీలతో తీవ్రంగా కొట్టారు.
– అప్పటికే బైపాస్ సర్జరీ చేయించుకొని కొన్ని రోజులే అయ్యింది. మెడిసిన్ వేసుకోవటానికి అనుమతి ఇవ్వలేదు.
– కొందరు వ్యక్తులు నా ఛాతీపై కూర్చొని ఊపిరాడనివ్వకుండా చేసి చంపేందుకుయత్నించారు.
– నా ఫోన్ తీసుకొని దాని పాస్ వర్డ్ చెప్పేంత వరకూ తీవ్రంగా కొట్టారు. సీఎం జగన్ ను విమర్శిస్తే చంపేస్తామని బెదిరించారు.
– జగన్ ఆదేశాలతోనే నాపై హత్యాయత్నం జరిగింది.
ఏయే సెక్షన్ల కింద కేసు నమోదు చేశారంటే..
– సెక్షన్ 120బీ – నేరపూరిత కుట్ర
– సెక్షన్ 166 వ్యక్తిని గాయపరిచేందుకు ప్రభుత్వ ఉద్యోగి ఉద్దేశపూర్వకంగా చట్టాన్ని అతిక్రమించటం