ఏపీలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల ధాటికి లంక గ్రామాలు ముంపునకు గురైన సంగతి తెలిసిందే. వరద నీరు లంక గ్రామాలను ముంచెత్తడంతో వందలాది ఇళ్లు నీట మునగగా….వేలాది మంది నిరాశ్రయులయ్యారు. అయితే, జనం వరద నీటిలో చిక్కుకొని అన్నమో రామచంద్రా అంటున్నా పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడన్న విమర్శలు వస్తున్నాయి. ఇక, అధికార పార్టీ నేతలైతే…కనీసం వరద బాధితులకు గుక్కెడు మంచినీరు కూడా అందించిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలోనే వరద బాధితులకు బాసటగా నిలిచారు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. ముంపునకు గురైన లంక గ్రామంలో పర్యటించిన నిమ్మల…నడుం లోతు వరద నీటిలో స్వయంగా వెళ్లి బాధితులను పరామర్శించారు.
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పరిధిలోని లంక గ్రామాల్లో పరిస్థితి వరద ప్రభావంతో దయనీయంగా మారింది. ఈ క్రమంలోనే వరద ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలకు నిమ్మల అభయమిచ్చేందుకు స్వయంగా అక్కడ పర్యటించారు. కనకాయలంకలో రాత్రి బస చేసిన నిమ్మల…అక్కడే ఆరుబయటే స్నానాధికాలు ముగించుకున్నారు. అనంతరం లంక గ్రామాలలో వరద నీటిలోనే పర్యటించారు. కొంత దూరం పడవలో ప్రయాణించిన నిమ్మల…ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు ధైర్యం చెప్పారు.
ఆ తర్వాత స్వయంగా వరద నీటిలో దిగిన నిమ్మల…మోకాళ్ల లోతు వరదనీటిలోనే నడుచుకుంటూ ప్రతి గడపకూ వెళ్లి వరద బాధితుల సమస్యలను తెలుసుకున్నారు. కొన్ని చోట్ల ఛాతీవరకు వరద నీరు చేరినా…వెనుదిరగకుండా పర్యటించారు నిమ్మల. వ్యాధుల బారిన పడకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని, వరద బాధితులకు సాయం చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తానని అన్నారు. పిల్లలకు పాలు, బిస్కెట్లు, పెద్దలకు భోజనం, మందులు సమయానికి అందించాలని కలెక్టర్ ను నిమ్మల కోరారు. వరదల్లో జనం చిక్కుకుంటే జగన్ మాత్రం హెలికాప్టర్ లో తిరుగుతున్నారని నిమ్మల మండిపడ్డారు. వరద ముంపును ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదంటూ విమర్శించారు. ‘ఆకాశంలో జగన్- వరద లో జనం’ అంటూ తన వీడియోను ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆకాశంలో జగన్- వరద లో జనం…
కనకాయలంక లో రాత్రి బస అనంతరం లంక గ్రామాలలో వరద నీటిలో ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు ధైర్యం చెప్తూ వారి సమస్యలను తెలుసుకుంటూ. ప్యురిఫైడ్ నీటిని అందించాలని, పిల్లలకు పాలు , బిస్కెట్లు, పెద్దలకు బోజనాలు సమయానికి అందించాలని కలెక్టర్ని కోరడం జరిగింది… pic.twitter.com/Bjebo3Yc1b— Nimmala Ramanaidu (@RamanaiduTDP) July 15, 2022