టీడీపీ నేతలు బోండా ఉమ, ఏవీ సుబ్బారెడ్డిలు త్వరలో వియ్యంకులు కాబోతున్నారు. బోండా ఉమ కుమారుడు సిద్ధార్థ్, ఏవీ సుబ్బారెడ్డి కుమార్తె జశ్వంతిలు త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్నారు. వీరిద్దరు ఒకరినొకరు ఇష్టపడడంతో ఇరు కుటుంబాల పెద్దలు వారి ప్రేమపెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో, ఈ నెల 27న వారి నిశ్చితార్థ వేడుక ఘనంగా జరగనుంది. ఈ సందర్భంగా ఆ సిద్దార్థ్, జశ్వంతి, బొండా ఉమ, ఏవీ సుబ్బారెడ్డిలు… టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. కాబోయే వధూవరులను చంద్రబాబు ఆశీర్వదించారు. తమ పిల్లల నిశ్చితార్ధ వేడుకకు తప్పక హాజరు కావాలంటూ పార్టీ అధినేత చంద్రబాబును బోండా ఉమ, ఏవీ సుబ్బారెడ్డి ఆహ్వానించారు.
సిద్ధార్థ్, జశ్వంతిలు ప్రస్తుతం టీడీపీ ఎన్నారై విభాగంలో చురుగ్గా పనిచేస్తున్నారు. అమెరికాలో చదువుకున్న వీరిద్దరి మధ్య ఎన్నారై టీడీపీ కార్యకలాపాల సందర్భంగా ప్రేమ చిగురించింది. దీంతో, వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని భావించారు. ఇదే విషయాన్ని ఇరు వర్గాల పెద్దలకు తెలియజేశారు. వారి ప్రేమను అర్థం చేసుకున్న ఇరు కుటుంబాల వారు పెళ్లికి అంగీకరించారు. దీంతో, ఈ నెల 27న వారి నిశ్చితార్థానికి ముహూర్తం ఖరారైంది.
ఈ క్రమంలోనే వారు చంద్రబాబును కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుతో దిగిన ఫొటోలను జశ్వంతి తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేయగా ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే, టీడీపీ నాయకులు ఇలా బంధుత్వం కలుపుకోవడం ఇదే తొలిసారి ఏమి కాదు. గతంలో మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, పి.నారాయణ వియ్యంకులు కాగా.. భీమవరం మాజీ ఎమ్మెల్యే రామాంజనేయులు కూడా గంటాకు వియ్యంకులే.
దివంగత నేత ఎర్రనాయుడి కుమారుడు, శ్రీకాకుళం ఎంపీ కింజరపు రామ్మోహన్నాయుడు.. విశాఖకు చెందిన టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణ మూర్తి కుమార్తె శ్రావ్యను వివాహం చేసుకున్నారు. రామ్మోహన్ నాయుడు సోదరి ప్రస్తుత రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని మామ కూడా టీడీపీ నేతగా ఉన్నారు. కాగా, ఇదే తరహాలో కొంతకాలం క్రితం వైసీపీ నేతలు కొలుసు పార్థసారథి, బుర్రా మధుసూదన్ యాదవ్ లు వియ్యంకులు అయిన సంగతి తెలిసిందే.