ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఘట్టం ముగిసిన సంగతి తెలిసిందే. తెల్లవారుఝామున మొదలు అర్ధరాత్రి వరకు ఓటు వేసేందుకు బారులు తీరిన ఓటర్లే వైసీపీపై ఉన్న ప్రజా వ్యతిరేకతకు నిదర్శనం అన్న టాక్ వస్తోంది. కూటమి గెలుపు ఖాయమని, వైసీపీ ఓటమి పక్కా అని పోలింగ్ సరళిని బట్టి ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా పోలింగ్ పై ఉండి టీడీపీ అభ్యర్థి రఘురామ కృష్ణరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో పోలింగ్ సరళి చూశాక పవన్ కల్యాణ్ గెలుపుపై తన అభిప్రాయం మార్చుకుంటున్నానని అన్నారు. పవన్ కు 50 వేల మెజారిటీ వస్తుందని తాను గతంలో చెప్పానని, కానీ, ఇపుడు 65 వేలకు పైగా మెజారిటీ వస్తుందని బల్లగుద్ది మరీ చెప్పారు. కొన్ని బూత్ లలో పవన్ కు అనుకూలంగా 80 శాతం ఓటింగ్ జరిగినట్లు తెలుస్తోందని అన్నారు.. కూటమికి 150కి పైగా ఎమ్మెల్యే స్థానాలు వస్తాయని, చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని కాన్ఫిడెంట్ గా ఉన్నారు.
కుప్పంలో చంద్రబాబు 60 వేల పై చిలుకు మెజారిటీతో గెలవబోతున్నారని జోస్యం చెప్పారు. ఆయనను ఓడించేందుకు ఓటుకు 4 నుంచి 5 వేలు ఇచ్చారంటున్నారని ఆరోపించారు. సత్తెనపల్లిలో అంబటి రాంబాబుపై కన్నా లక్ష్మీనారాయణ భారీ మెజారిటీతో గెలవబోతున్నారని జోస్యం చెప్పారు. తనకు కన్నా, రాంబాబు ఇద్దరూ స్నేహితులేనని అన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో వార్ వన్ సైడ్ అని, కూటమి క్లీన్ స్వీప్ ఖాయమని చెప్పారు. తాను చెప్పినవన్నీ కరెక్టా, కాదా అనేది జూన్ 4న తేలుతుందని, తన అంచనాలు నిజమవుతాయన్న నమ్మకం తనకుందన్నారు.