టాలీవుడ్ అగ్ర నటుల్లో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ అలియాస్ తారక్ వార్తల్లోకి వచ్చారు. సినిమాలకు సంబంధం లేని విషయానికి సంబంధించిన ఆయన ఫోటోలు ఇప్పుడు వాట్సాప్ గ్రూపుల్లో.. సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. సినిమాల పరంగా తప్పించి.. వ్యక్తిగతంగా తన విషయాల్ని బయటకు రాకుండా చేసుకోవటం ఎక్కువ అంటారు. ఆయనకు వాచీలంటే చాలా.. చాలా ఇష్టం. తరచూ ఖరీదైన వాచీల్ని తెగ మార్చేస్తుంటారు.
ఇందుకోసం భారీగా వెచ్చిస్తారని చెబుతారు. ఫ్యామిలీతో కలిసి బయటకు రావటం.. తనకు సంబంధించిన కార్యకలాపాల్ని బయటకు రాకుండా కేర్ తీసుకుంటారు. అలాంటి తారక్ తాజాగా.. రంగారెడ్డి జిల్లాలోని శంకర్ పల్లి తహశీల్దార్ ఆఫీసుకు వెళ్లిన వైనం ఆసక్తికరంగా మారింది. తనకు తానే స్వయంగా రెవెన్యూ ఆఫీసుకు రావటంతో.. అక్కడి ఉద్యోగుల్లో ఆసక్తి వ్యక్తం కావటమే కాదు.. కాసేపు పని పక్కన పెట్టేసి.. ఆయనతో ఫోటోలు దిగేందుకు విపరీతమైన ఆసక్తిని చూపించారు.
ఇంతకీ తహశీల్దార్ ఆఫీసుకు తారక్ ఎందుకు వెళ్లినట్లు? అన్నది ఆరా తీస్తే.. ఆయన గోపాలపురం గ్రామంలో ఆరున్నర ఎకరాల భూమిని కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ల పనుల కోసం ఎమ్మార్వో ఆఫీసుకు వెళ్లినట్లుగా తెలుస్తోంది. తమ ఆఫీసుకు వచ్చిన తారక్ తో అధికారులు. . సిబ్బంది ఫోటోలు దిగేందుకు పెద్ద ఎత్తున ఆసక్తిని ప్రదర్శించారు.
తారక్ తో తాము దిగిన ఫోటోల్ని వారి సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేసుకున్నారు. దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న మూవీతో పాటు.. సినిమాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ అన్న టీవీ రియాల్టీ షోకు పని చేస్తున్నారు. త్వరలోనే ఈ కార్యక్రమం ప్రాసారం కానుంది. ఏమైనా రెవెన్యూ కార్యాలయానికి స్వయంగా వెళ్లిన తారక్ రాకతో.. సదరు కార్యాలయంలో సందడి వాతావరణం నెలకొంది.