ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఇప్పటి వరకు చక్రం తిప్పిన కాపు నాయకుడు, ఆర్ ఎస్ ఎస్ మూలాలు ఉన్న వ్యక్తి సోము వీర్రాజు వ్యవహరించిన విషయం తెలిసిందే. అయితే.. ఇప్పుడు రాష్ట్ర పార్టీ పగ్గాలను బీజేపీ అధిష్టానం అనూహ్యంగా ఎవరూ ఊహించని రీతిలో అన్నగారుఎన్టీఆర్ కుమార్తె, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరికి అప్పగించింది. ఇక, ఈ విషయం అలా వెలుగు చూసిందో లేదో.. అప్పటి వరకు విజయవాడలో ఒక కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తున్న సోము వీర్రాజు.. వడివడిగా సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఆయన ఎక్కడికి వెళ్లారనేది తెలియలేదు.
అంతేకాదు.. సభ నుంచి వెళ్లిపోయిన సోము వీర్రాజు తన ఫోన్‌ను కూడా స్విచ్ఛాఫ్ చేసుకున్నారని పార్టీ కీలక నేతల మధ్య చర్చసాగింది. అంటే..ఏపీ బీజేపీ పగ్గాలను పురందేశ్వరికి అప్పగించడం పట్ల సోము ఆగ్రహంతో ఉన్నారనేది స్పష్టమైందని వారు చెబుతున్నారు. అదేసమయంలో వాస్తవానికి సోము వీర్రాజు ఇద్దరి పేర్లను అధిష్టానానికి సూచించారని.. వారిద్దరూకూడా రాయల సీమకు చెందిన వారనే ప్రచారం కొన్నాళ్లుగా సాగుతోంది. ఒకరు విష్ణు వర్ధన్‌రెడ్డి కాగా, రెండో వారు సత్యకుమార్ యాదవ్. వీరిద్దరిలో ఎవరికి ఇచ్చినా.. పార్టీ పుంజుకునే పరిస్థితి ఉంటుందని కూడా ఆయన అధిష్టానానికి చెప్పినట్టుకొన్నాళ్ల కిందటి వరకు ప్రచారంలో ఉంది.
అయితే.. వారిని పక్కన పెట్టి పురందేశ్వరి కి పార్టీ పగ్గాలు అప్పగించడంతో సోముఅజ్ఞాతంలోకి వెళ్లారనే చర్చ సాగుతోంది. ఇదిలావుంటే.. మరికొందరు సోము పార్టీ మారడం ఖాయమని చెబుతున్నారు. ఆయనకు వైసీపీతో అనుబంధం ఉందని.. కాబట్టి ఆ పార్టీలో చేరితే.. ఎమ్మెల్సీ అయినా దక్కుతుందని కొందరు చెబుతున్నారు. ఏదేమైనా.. సోము ఒక్కసారిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం, ఫోన్ స్విచ్ఛాప్ చేసుకోవడం వంటివి రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆర్ ఎస్ ఎస్వాదిగా పేరున్న సోము.. బీజేపీ పగ్గాలు చేపట్టినప్పటికీ.. ఆ ముద్ర వేయలేకపోయారు.
పైగా.. సోము హయాంలో మొత్తం మూడు ఉప ఎన్నికలు వచ్చాయి. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వచ్చాయి. అయినా.. ఆశించిన రీతిలో సోము ప్రభావం చూపించలేక పోయారు. ఇదిలావుంటే.. చీపు లిక్కర్‌ను రూ.50 కే ఇస్తామని.. ఆయన చేసిన వ్యాఖ్యలతో బీజేపీ నేతలు.. చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అదేసమయంలో పొత్తులపై కూడా ఆయన చేసిన విమర్శలు.. పార్టీని ఇరకాటంలోకి నెట్టాయి. తమ పార్టీతో చెలిమి చేస్తున్న జనసేన విషయంలోనూ అంటీముట్టనట్టుగా నే సోము వ్యవహరించారు. మొత్తానికి వివాదాలతోనే ఆయన రెండున్నరేళ్లపాటు బీజేపీని నడిపించారని చెప్పకతప్పదు.