ఒకరిని డ్యామేజ్ చేయటం ఎంత సులువు అన్న విషయం ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తే అర్థమవుతుంది. గడిచిన మూడు రోజులుగా వాట్సాప్ గ్రూపుల్లోనూ.. సోషల్ మీడియాలో ఒక అంశంపై అదే పనిగా పోస్టులు వస్తున్నాయి. సింఫుల్ గా విషయంలోకి వెళితే.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానల్ లో పని చేసే ప్రముఖ టీవీ జర్నలిస్టు వెంకటక్రిష్ణను చానల్ నుంచి వైదొలిగారు.
దీనికి కొందరు తీసేశారంటే.. మరికొందరు ఆయనే తప్పుకున్నారన్న భాష్యం చెప్పారు. మొత్తంగా నిజం ఏమంటే.. ఆయనకు.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానల్ కు మధ్యనున్న బంధం తెగింది. ఇటీవల కాలంలో మీడియాకు చెందిన వివరాలు.. అందులో పని చేసే ప్రముఖుల వివరాలు తెలుసుకోవాలన్న ఆసక్తి వ్యక్తమవుతోంది. నిజానికి పాతికేళ్ల క్రితం మీడియాలో పని చేసే వ్యక్తులు ఇంత ఛార్మ్.. సెలబ్రిటీ స్టేటస్ ఉండేది కాదు. కారణం.. వారెప్పుడూ బయట కనిపించకపోవటమే.
ఎప్పుడైతే టీవీ చానళ్లు రావటం.. కొందరు స్క్రీన్ మీద అదే పనిగా కనిపిస్తూ.. కీలకమైన వార్తలు.. ప్రముఖ వ్యక్తుల్ని ఇంటర్వ్యూ చేయటం ద్వారా వారి ప్రాధాన్యత పెరిగింది. మీడియా మధ్య పెరిగిన పోటీతో కొందరని తమ చానల్ కు ఫేస్ గా ప్రదర్శిస్తూ ప్రచారాన్ని షురూ చేశారు. మొత్తంగా దినపత్రికల్లో పని చేసే వారితో పోలిస్తే.. న్యూస్ చానళ్ల పని చేసే జర్నలిస్టులకు ఇమేజ్ పెరిగింది. సెలబ్రిటీలుగా మారారు.
మిగిలిన రంగాలకు చెందిన సెలబ్రిటీలకు అభిమానులు.. వ్యతిరేకులు ఉన్నట్లే.. చానళ్లలో పని చేసే జర్నలిస్టులకు ఉండటం మొదలైంది. కారణం.. ఒక్కో మీడియా సంస్థకున్న పొలిటికల్ లైన్ కావొచ్చు.. వారి మీద పడిన ముద్రలు కావొచ్చు. వెంకట క్రిష్ణ విషయాన్నే తీసుకుంటే ఆయన తెలుగు దేశం పార్టీకి ప్రో అన్న పేరుంది. దీనికి ఆయన సామాజిక వర్గాన్ని జత చేస్తూ.. కరడుగట్టిన పసుపు వీరుడిగా ఆయన మీద విమర్శలు చేస్తుంటారు.
ప్రతి రంగంలోనూ ఇలాంటివి మామూలే. కాకుంటే.. మీడియా మీద ప్రజలకు సహజంగానే కాస్త ఎక్కువ అటెన్షన్ ఉంటుంది.అందులో పని చేసే వారి విషయాల మీద ఆసక్తి ఉంటుంది. సెలబ్రిటీ స్టేటస్ ఉండే వారి విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే ఉండదు. సమాజంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో పరిచయాలు.. వారితో ఉండే సాన్నిహిత్యం తో కొన్ని ఆరోపణలు వినిపిస్తూ ఉంటాయి.
వెంకటక్రిష్ణ కూడా అందుకు అతీతమేం కాదు. దూకుడు స్వభావంతో పాటు.. ఆయన మాటలోనూ ఫోర్సు ఎక్కువ. దీంతో..ఆయన్ను అభిమానించేవారు.. ఆయనపై ఆగ్రహాన్ని ప్రదర్శించే వారు కనిపిస్తారు. అంతమాత్రాన ఎలాంటి ఆధారాలు చూపించకుండా ఇష్టం వచ్చినట్లుగా రాతలు రాసేయటం ఏ మాత్రం సరికాదు. అలాంటి రాతల్లో ప్రముఖంగా వైరల్ అవుతున్నది.. వెంకట క్రిష్ణ.. ఆయన తాజా మాజీ బాస్ ఆర్కే అలియాస్ ఆంధ్రజ్యోతి రాధాక్రిష్ణ ఇద్దరు కొట్టుకునే వరకు వెళ్లారన్నది. బయట వారికి ఇదంతా నిజమని నమ్మేలా ఉంటుంది. కానీ.. అలాంటి పరిస్థితి అస్సలు ఉండదు. ఒకవేళ ఇది నిజంగానే జరిగి ఉంటే.. ఈపాటికి వాట్సాప్ లో వీడియోలే షేర్ అవుతూ ఉండేవి.
తన ట్విటర్ ఖాతాలో వెంకట క్రిష్ణ తనకు.. ఆంధ్రజ్యోతి ఎండీ రాధా క్రిష్ణకు మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని స్పష్టంగా పేర్కొన్నారు. అంతేకాదు.. తాను ఉద్యోగాన్ని వదిలేయటానికి వేరే కారణాలు ఏమీ లేవని చెప్పారు. ప్రస్తుతానికి సెలవు మాత్రమేనని.. అంతకుమించి ఏమైనా ఉంటే త్వరలోనే చెబుతానని స్పష్టం చేశారు.
ఈ పోస్టు సంగతి ఇలా ఉంటే.. వాట్సాప్ లో వైరల్ అవుతున్న పోస్టులు మరీ దారుణంగా.. వ్యక్తిత్వ హననానికి గురి చేసేలా ఉండటం ఆందోళన కలిగించేది. అందులో ఒక పోస్టు మచ్చుకు.. (అది కూడా వెంకట క్రిష్ణ పోస్టు చేసి.. ఇలాంటివి నమ్మొద్దు. ఫేక్ అని పేర్కొంటూ.. అలాంటి వాటిపై చట్టబద్దమైన చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు)
‘‘నా మీద మీరు రాసిన ఆర్టికల్ చూసి చాలా బాధేసింది. మీరు ఇలాగే బరి తెగిస్తే ఆవిడ పంపిన మెసేజ్ లు కూడా బాహ్య ప్రపంచానికి తెలియజేయాల్సి ఉంటుంది. మీ కూతురి తప్పును కప్పిపుచ్చి నామీద నెపం వేయటం తగదు ఆర్కే గారు. నిజానిజాలు మాట్లాడితే మంచిది. మీరు అందరిని భయపెట్టినట్లు నన్ను భయపెట్టకండి. అమరావతి నుంచి వచ్చే నిధులు నుంచి బీజేపీ నేత విష్ణు మీద జరిగిన దాడి గురించి కూడా మాట్లాడాల్సి వస్తుంది’’ అంటూ వెంకట క్రిష్ణ పేరు మీద వైరల్ అవుతున్న మెసేజ్ లు చూసినప్పుడు.. మరీ ఇంత ఆరాచకమా? అనిపించక మానదు.
ఎంత కోప తాపాలు ఉంటే.. కుటుంబ సభ్యుల్ని ఇందులోకి లాగే దుర్మార్గం ఏ మాత్రం మంచిది కాదు. ఇలాంటివి సమాజానికి సైతం మంచిది కాదు. ఒకరు తమకు నచ్చరు కాబట్టి.. వారిని ఎన్ని యాంగిల్స్ లో కుదిరితే అన్ని కోణాల్లో దెబ్బ తీయాలన్న ఆలోచన విపరిణామాలకు దారి తీస్తుందన్నది మర్చిపోకూడదు. తాజా ఎపిసోడ్ తో సోషల్ మీడియా తన గీతలన్ని దాటేసిందని చెప్పాలి. ఇలాంటి వాటి విషయాల్లో చట్టం తన పని తానెందుకు చేయదు? ఇవాళ మనది కాదని వదిలేస్తే.. రేపొద్దున మన గురించి కూడా ఇలాంటి చిల్లర రాతలు సోషల్ మీడియాలో దర్శనమిస్తాయన్నది మర్చిపోకూడదు.
Some people are spreading this with fake account.. plz don't trust.. I have high regards with #ABNRadhakrishna garu..and I am just on leave only.. I am proceeding legally on these fake account creators.. if anyone knows about these fake jokers provide me the details.. thanq pic.twitter.com/NzB717bFlf
— VenkataKrishna (@vkjourno) March 24, 2021