ఈ నెలలో రాబోతున్న క్రేజీ చిత్రాల్లో ‘సరిపోదా శనివారం’ ఒకటి. మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా, అంటే సుందరానికీ లాంటి వెరైటీ సినిమాలు తీసిన వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన చిత్రమిది. ఈ సినిమా ప్రకటించినపుడే ప్రేక్షకుల్లో ఒక రకమైన క్యూరియాసిటీ ఏర్పడింది. అందుకు ప్రధాన కారణం.. ‘సరిపోదా శనివారం’ అనే టైటిల్. ఇలాంటి టైటిల్ తెలుగులో ఇప్పటిదాకా ఎప్పుడూ చూడలేదు. ఈ టైటిల్ మర్మమేంటి అని అందరూ ఆసక్తితో చూస్తున్నారు. దీన్ని బట్టి కథ ఏమై ఉంటుందని గెస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ సినిమా ప్రోమోలు చూస్తే మాత్రం కథ మీద ఒక ఐడియా రాలేదు. అసలీ శనివారం కథేంటో తెలుసుకోవాలని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఐతే సినిమా విడుదలకు ఇంకా మూడు వారాలుండగా.. ఈలోపే ఈ కథ మీద క్లారిటీ ఇచ్చేశాడు ఈ చిత్రంలో విలన్ పాత్ర చేస్తున్న ఎస్.జె.సూర్య. ‘సరిపోదా శనివారం’ చిత్రానికి ఇప్పట్నుంచే టీం ప్రమోషన్లు మొదలుపెట్టేసింది. ఇందులో భాగంగా సూర్య ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.
అందులో ఈ సినిమా కథను టూకీగా చెప్పేశాడు సూర్య. ‘‘ఈ చిత్రంలో హీరో నానికి చిన్నతనం నుంచే కోపం ఎక్కువ. దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తల్లికి అర్థం కాదు. పెద్దవాడు అయ్యేకొద్దీ ఇది ఇంకా పెద్ద సమస్య అవుతుందని భావించి.. అతడికో కండిషన్ పెడుతుంది. నీకు కోపం వస్తే వారంలో ఒక్క రోజు మాత్రమే దాన్ని తీర్చుకో, మిగతా ఆరు రోజులు ప్రశాంతంగా ఉండమని చెబుతుంది. అతడి కోపం తీర్చుకునే రోజు శనివారం. వారంలో ఆ ఒక్క రోజు నాని ఏం చేస్తాడన్నదే ఈ సినిమా కథ’’ అని సూర్య తెలిపాడు. ఐతే సూర్య అనుకోకుండా ఈ కథ చెప్పేశాడా.. లేక టీం ఆ విషయంలో క్లారిటీ ఇచ్చేయమని ఆయనకు చెప్పేసిందా అన్నది తెలియదు కానీ.. ‘సరిపోదా శనివారం’ కథ తాలూకు గుట్టు అయితే బయటికి వచ్చేసింది. మరి ఈ కథకు వివేక్ ఆత్రేయ ఎలాంటి కథనం జోడించి మ్యాజిక్ చేయబోతున్నాడో చూడాలి.