ఈ రోజుల్లో సినిమాల ప్రమోషన్ అంతా సోషల్ మీడియా వేదికగానే నడుస్తోంది. ఆయా చిత్ర బృందాల్లోని వాళ్లే.. సరదాగా సంభాషించుకుంటూ.. ఒకరినొకరు గిల్లుకుంటూ నెటిజన్ల దృష్టిని ఆకర్షించడం.. తమ సినిమా గురించి అందరూ చర్చించుకునేలా చేయడం లాంటివి చేస్తున్నారు. షారుఖ్ ఖాన్ కూడా ఈ ట్రెండునే ఫాలో అవుతున్నాడు.
తన కొత్త చిత్రం జవాన్ గురించి ట్వీట్లు చేస్తున్న సెలబ్రెటీలతో అతను ఫన్నీ కాన్వర్జేషన్లు చేస్తున్నాడు. ఈ సినిమాలో విలన్ పాత్ర చేసిన విజయ్ సేతుపతితో షారుఖ్ సంభాషణ అందరిలోనూ ఆసక్తి రేకెత్తించింది. తర్వాత నయనతార భర్త విఘ్నేష్ శివన్తోనూ షారుఖ్ ఇదే శైలిలో సంభాషించి నెటిజన్ల దృష్టిని ఆకర్షించాడు. జవాన్‌లో నయనతారే కథానాయిక అన్న సంగతి తెలిసిందే.
జవాన్ ట్రైలర్ గురించి విఘ్నేష్ శివన్ స్పందిస్తూ.. ఇలాంటి మెగా మూవీతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన దర్శకుడు అట్లీకి శుభాకాంక్షలు తెలిపాడు. అలాగే షారుఖ్ సినిమాతోనే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వాలన్న తన భార్య నయనతార కోరిక తీరిందని పేర్కొన్నాడు. ట్రైలర్ అదిరిపోయిందని కూడా అతను ట్వీట్ చేశాడు. దీనిపై షారుఖ్ స్పందిస్తూ.. విఘ్నేష్‌కు థ్యాంక్స్ చెప్పాడు. అంతే కాక నయనతారతో కొంచెం జాగ్రత్తగా ఉండాలని విఘ్నేష్‌కు హెచ్చరిక జారీ చేశాడు షారుఖ్.
నయన్ జవాన్ సినిమాలో భాగంగా కొన్ని కొత్త పంచ్‌లు నేర్చుకుందని షారుఖ్ తెలిపాడు. ట్రైలర్ చూస్తే జవాన్ ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీలా కనిపిస్తోంది. నయన్ సైతం యాక్షన్ టచ్ ఉన్న పాత్రే చేసినట్లుంది. ఆమెను కూడా కొన్ని స్టంట్లలో చూడొచ్చేమో. అందుకే షారుఖ్ ఆమె పాత్రను సూచించేలా విఘ్నేష్‌కు వార్నింగ్ ఇచ్చాడు. జవాన్ సెప్టెంబరు 8న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.