జగన్ పాలనలో సర్పంచుల పరిస్థితి దయనీయంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తమ సమస్యలు పరిష్కరించాలంటూ వాళ్లు పలుమార్లు రోడ్డెక్కి నిరసన తెలిపారు. అయినా, ఫలితం లేకపోవడంతో తాజాగా వారు కేంద్ర ప్రభుత్వానికి తమ మొర చెప్పుకునేందుకు ఢిల్లీ వెళ్లారు. టీడీపీ ఎంపీలు రామ్మోహన్ నాయుడు, కనకమేడల రవీంద్రకుమార్ లతో కలిసి ఏపీ సర్పంచుల సంఘం నేతలు….కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు. ఏపీలో పంచాయతీలు, నిధులు, సర్పంచ్ ల సమస్యలను వివరించారు.
పంచాయతీ నిధుల మళ్లింపు వంటి చట్ట విరుద్ధమైన చర్యలపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని కేంద్రమంత్రిని వారు కోరారు. దొంగలు పడి పంచాయతీ నిధులను దొంగిలించారని ఫిర్యాదు చేశామని విన్నవించుకున్నామన్నారు. అయితే, సర్పంచ్ ల సమస్యలపై పరిశీలిస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చనట్లు సర్పంచ్ సంఘ నేతలు చెప్పారు. దీంతో, ఏపీ సీఎం జగన్ పరువు ఢిల్లీలో పోయినట్లయింది.
పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసే చర్యలు, నిధుల మళ్లింపులు మానుకోవాలని జగన్ కు కనకమేడల హితవు పలికారు. నిధుల మళ్లింపు అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తుతామని చెప్పారు. 120 మంది సర్పంచులు ఢిల్లీ వచ్చి కేంద్రం వద్ద ఫిర్యాదు చేశారని, దానిపై కేంద్రం సానుకూలంగా స్పందించిందని ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు.
కాగా, 14, 15వ ఆర్థిక సంఘం విడుదల చేసిన 8660 కోట్ల రూపాయల నిధులను జగన్ సర్కార్ పక్కదారి పట్టించిందని, వాటిని గ్రామపంచాయతీల ఖాతాలలో జమ చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు గతంలో డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ నిధుల కోసం, తమ సమస్యల పరిష్కారం కోసం ఏపీలో వేలాదిమంది సర్పంచ్ లు గతంలో పలుమార్లు నిరసన కార్యక్రమాలు చేపట్టినా ఫలితం లేకపోవడంతో ఢిల్లీలో కేంద్రానికి ఫిర్యాదు చేశారు.