తెలుగు ప్రజలకు సుపరిచితడు రాంగోపాల్ వర్మ చూసే కోణమే ఆయన్ను మిగిలిన వారిని ప్రత్యేకంగా మారుస్తుంది. అందుకు ఆయన మాటలకు.. విశ్లేషణకు మీడియా అటెన్షన్ ఉంటుంది.
రాంగోపాల్ వర్మను ఇప్పటికి కొన్ని వేల మంది ఇంటర్వ్యూలు చేసి ఉంటారు. ప్రశ్నలు అడిగే వారికి.. తనకు తోచినట్లు సమాధానాలు ఇవ్వటం.. తన మాటలతో మరింత కాక పుట్టేలా చేయటం అతనికి అలవాటే. మరి.. అలాంటి రాంగోపాల్ వర్మ తనకు తానుగా ఇంటర్వ్యూ చేయాలని ఫీల్ అయితే? ప్రశ్నలకు సమాధానాలు చెప్పే స్థానం నుంచి.. ప్రశ్నలు సంధించే స్థానంలోకి వస్తే ఎలా ఉంటుంది? అన్న విషయాన్ని చేతల్లో చేసి చూపించారు.
కరోనా ఎపిసోడ్ లో పరుచూరి మల్లిక్ తెలుగురాష్ట్రాలకు సుపరిచితుడిగా మారాడు. కరోనా కు సంబంధించిన విషయాల్ని తనదైన ధోరణిలో చెబుతున్న వైనం సంచలనంగా మారటం తెలిసిందే. అతగాడి వీడియోలు వాట్సాప్ గ్రూపుల్లో భారీగా షేర్ కావటమే కాదు.. ఆయన చెప్పిన మాటలపై టీవీ చానళ్లు చర్చా కార్యక్రమం పెట్టే వరకు వెళ్లటం చూస్తున్నాం.
రెండు రోజుల క్రితం మల్లిక్ చేస్తున్న వ్యాఖ్యలపై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసి.. కేసు నమోదు చేయటం తెలిసిందే. థర్డ్ వేవ్ వస్తే.. ఇంటికొకరు మరణిస్తారన్న అతని వ్యాఖ్య పెను సంచలనంగా మారటమే కాదు.. ప్రజలు వణికిపోయే పరిస్థితి.
ఇలాంటి సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన పరుచూరి మల్లిక్ ను వర్మ ఇంటర్వ్యూ చేయాలని డిసైడ్ అయ్యారు. వర్చువల్ గా జరిగిన ఈ ఇంటర్వ్యూలో మల్లిక్ బ్యాక్ గ్రౌండ్ తో పాటు.. కరోనా మీద గత ఏడాది నుంచే ఫేస్ బుక్ లో పెట్టిన పోస్టులు.. కరోనా రోగులకు వాడిన మందులపై తనకున్న అభ్యంతరాల్ని వివరించారు.
సాధారణంగా వర్మ ఫ్రేమ్ లో ఉన్నప్పుడు ఆయన మాట్లాడటమే ఎక్కువగా కనిపిస్తుంటుంది. అందుకు భిన్నంగా వర్మ అడిగే ప్రశ్నలకు మల్లిక్ సమాధానాలు ఇవ్వటం.. వాటన్నింటిని వినటానికే వర్మ ప్రాధాన్యత ఇవ్వటం కనిపిస్తోంది. గంటకు పైగా ఉన్న ఈ వీడియో ఇప్పుడు సంచలనంగానే కాదు.. అందరిని ఆకర్షించేలా మారింది. ఏమైనా ఎవరూ ఊహించని రీతిలో వ్యవహరించిన వర్మ కొత్త అవతారం పలువురిని ఆకర్షిస్తోంది.
ఆ ఇంటర్వ్యూ ఇక్కడ చూడొచ్చు.