తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చూడాలి ఆయన మాటల విన్యాసం. ప్రజాస్వామ్యానికి ముఖ్యమంత్రి గారు ఇచ్చే విలువ.. ఆయన ఇచ్చే ప్రాధాన్యత ఎంతన్న విషయాన్ని ఆయన కథలు.. కథలుగా చెప్పేస్తారు. రాష్ట్ర హక్కుల్ని అలా హరించేస్తారా? ఇదేం అన్యాయం అంటూ కేంద్రం మీద నిప్పులు చెరిగే ఆయన ఆగ్రహం చూసినోళ్లు.. అయ్యో పాపం అనుకుంటారు. ఇన్ని గొప్ప మాటలు చెప్పే కేసీఆర్.. తన వరకు వచ్చేసరికి వ్యవహరించే ధోరణి మరింత విచిత్రంగా ఉంటుంది. కేంద్రం తీరుపై నిరసన వ్యక్తం చేయటానికి ముఖ్యమంత్రి హోదాలో ధర్నా చౌక్ వద్దకు వెళ్లి.. విరుచుకుపడే ఆయన.. తన మాదిరే రాష్ట్రంలో నిరసన వ్యక్తం చేసే హక్కు ఉంటుందన్న విషయాన్ని ఎందుకు మర్చిపోతారన్నది ప్రశ్న.
తెలంగాణ కాంగ్రెస్ రథసారధి కమ్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి ఇష్యూలో కేసీఆర్ అదే పనిగా చేస్తున్న తప్పులు.. ఆయన ఇమేజ్ ను పెంచేస్తున్నాయని చెప్పక తప్పదు. ఆయన ఏదైనా నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చి.. అందులో పాల్గొనేందుకు బయలుదేరటానికి ముందు.. ఆయన్ను అడ్డుకోవటానికి ఆయన ఇంటి ముందు పోలీసులు భారీ ఎత్తున బ్యారికేడ్లను ఏర్పాటు చేసే వైనం వింతగానూ.. విచిత్రంగానూ ఉంటుంది. ప్రభుత్వ తీరును తప్పు పడుతూ ఏర్పాటు చేసే కార్యక్రమాల్ని అడ్డుకోవటం ద్వారా ప్రభుత్వానికే చెడ్డపేరు తెస్తుందన్న చిన్న లాజిక్ ను కేసీఆర్ అండ్ కో ఎందుకు మర్చిపోతారో?
తాజా ఎపిసోడ్ ను చూస్తే.. 317 జీవో కారణంగా మహబూబాబాద్ నుంచి ములుగు జిల్లాకు బదిలీ కావటంతో గుండెపోటుతో మరణించిన హెడ్మాస్టర్ కుటుంబాన్ని పరామర్శించటానికి రేవంత్ రెడ్డి వెళ్లాల్సి ఉంది. షెడ్యూల్ ప్రకారం శుక్రవారం ఉదయం ఆయన ఇంటి నుంచి బయలుదేరాల్సి ఉంటే.. గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత.. ఆయన ఇంటిని భారీగా పోలీసులు మొహరించారు. తెల్లవారుజామున రేవంత్ ఇంటికి వెళ్లే దారుల్ని మూసేసి.. బారికేడ్లు ఏర్పాటు చేశారు. కొంతమంది పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించి.. ఇంటి వెనుక నుంచి లోపలకు వెళ్లారు. ఈ వ్యవహారాన్ని గుర్తించిన రేవంత్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
ఏంటి తమాషాలు చేస్తున్నారా? ఇంట్లోకి వచ్చుడేంది? ఎవరు చెప్పిండ్రు.. మీకు లోపలకు వెళ్లమని.. మర్యాద ఇస్తున్నాను కదా అని నెత్తినెక్కి కూర్చుంటే ఊరుకోనంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ ఇంటి వద్ద పోలీసులు తీరు తెలుసుకున్న పలువురు కాంగ్రెస్ నేతలు..కార్యకర్తలు ఆయన ఇంటికి రావటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్.. రాష్ట్రంలో పౌరుల స్వేచ్ఛను ముఖ్యమంత్రి కేసీఆర్ హత్య చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష నేతల ఇళ్లల్లోకి ఖాకీలను ఉసిగొల్పుతున్నారని ఆరోపించటంతో పాటు.. పరామర్శలు.. బంధువుల ఇళ్లల్లో శుభకార్యాలకు వెళ్లకుండా నిర్బందిస్తున్నారని తప్పు పట్టారు. తాను ఇంట్లో నుంచి కాలు కదిపితే కేసీఆర్ గజగజ వణికిపోతున్నట్లు వ్యాఖ్యానించిన ఆయన.. ప్రజాగ్రహం పెల్లుబికిన రోజున కేసీఆర్ ప్రగతిభవన్ లు.. ఫాంహౌస్ లు బద్ధలవుతాయన్నారు.
అకారణంగా తన ఇంటి చుట్టూ పోలీసులు మొహరించటంపైన లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు రేవంత్ ఫిర్యాదు చేశారు. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా శుక్రవారం తెల్లవారుజామున తన ఇంటిని చుట్టుముట్టారని.. ఇలా జరగటం ఇది రెండోసారిగా ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగం తనకు కల్పించిన హక్కులను.. స్వేచ్ఛను కాపాడాలన్నారు. ఇదంతా చూస్తే.. పరామర్శలు.. నిరసనలకు వెళ్లి రేవంత్ సాధించే మైలేజీ కంటే.. ఆయన్ను ఇంటికే కట్టడి చేసి కేసీఆర్ సర్కారు అంతకు మించిన ఇమేజ్ ను ఆయనకు సొంతం చేస్తున్నారన్న మాట వినిపిస్తోంది. ఇదేం లెక్క కేసీఆర్?