తెలంగాణ రాజకీయాల హీట్ పెంచేస్తున్న హుజూరాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి తాజాగా సంచలన వ్యాఖ్య చేశారు మంత్రి కేటీఆర్. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తన అభ్యర్థి గురించి ప్రచారం చేయట్లేదని ఆరోపించిన ఆయన.. రేవంత్.. ఈటల రహస్య భేటీ గోల్కొండ రిసార్టులో జరిగినట్లుగా ఆయన వెల్లడించారు. దీనికి సంబంధించిన విశ్వసనీయమైన సమాచారం తమ వద్ద ఉందన్నారు.
ఈ సమావేశానికి సంబంధించి తన కార్యకర్తలు.. అభిమానులు.. రిసార్ట్ ఉద్యోగుల ద్వారా నిర్దిష్టమైన సమాచారం ఉందని.. రహస్య భేటీ జరగలేదని వారు ఖండిస్తే.. ఫోటోలు.. ఇతర ఆధారాలు కూడా ఇస్తామని సవాలు విసిరారు.
ఆ రహస్య సమావేశంలో భాగంగానే కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఎవరూ గుర్తించలేని అనామకుడ్ని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దించారని.. ఉద్దేశపూర్వకంగానే డమ్మీ అభ్యర్థిని నిలబెట్టిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచారాన్ని కూడా నిర్వహించటం లేదన్నారు.
రేవంత్.. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఈటలకు అనుకూలంగా ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు.
కేటీఆర్ చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
నిజంగానే.. రేవంత్ – ఈటల రహస్య సమావేశం జరిగి ఉంటే.. దాన్ని వ్యూహాత్మకంగా బయటపెట్టేవారు కదా? అందుకు భిన్నంగా సవాలు విసరటం ఎందుకు? అన్నది ప్రశ్నగా మారింది. ప్రత్యర్థిని దెబ్బ తీసే అవకాశం రావాలే కానీ.. దాన్ని వదులుకోవటానికి ఏమాత్రం ఇష్టపడని గులాబీ పార్టీ తీరుకు భిన్నంగా సవాలు విసిరి.. సమాధానం చెప్పాలనటం ఏమిటన్న ప్రశ్న పలువురి నోట వినిపిస్తోంది. ఇదంతా చూస్తే.. ఈటలను ఆత్మరక్షణలో పడేసేలా కేటీఆర్ మాటలు ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అయితే, ఇంకో వాదన కూడా ఉంది. ఈటెలకు రేవంత్ మద్దతు ఉందని కేటీఆర్ చేసిన ప్రచారం వల్ల కాంగ్రెస్ ఓట్లు బీజేపీకి వేసేలా కేటీఆర్ వ్యాఖ్యలు ఉన్నాయని కూడా అంటున్నారు. నిజమే కావచ్చు.