నిజమే… జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే… తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో బీజేపీ- జనసేన కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగిన బీజేపీ నేత, మాజీ ఐఏఎస్ అధికారిణి రత్నప్రభ వైసీపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయంగానే కనిపిస్తోంది. అంతేకాదండోయ్… ఇప్పుడైతే ఎంపీగా గెలుపొందేందుకు బరిలోకి దిగిన ఆమె… వైసీపీలోకి చేరి ఎమ్మెల్యేగా ఏపీ అసెంబ్లీలోకి అడుగుపెట్టడం కూడా ఖాయంగానే కనిపిస్తోందన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
ప్రస్తుతం తిరుపతి ఉప ఎన్నికల ప్రచార పర్వంలో ఒకింత బిజీగానే కనిపిస్తున్న రత్నప్రభ… ఆ ఎన్నిక ముయగానే వైసీపీ కండువా కప్పుకోవడం ఖాయమేనని రాజకీయ విశ్లేషకులు బల్ల గుద్ది మరీ చెబుతున్నారు. ఇందుకు ఆమె నోట నుంచి వస్తున్న మాటలు… వైసీపీ ఈక్వేషన్లు, రత్నప్రభ భవిష్యత్తు ప్రణాళికలను కారణాలుగా చూపిస్తున్నారు. అదెలాగో చూద్దాం పదండి.
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక అంశంగా ప్రస్తావనకు రాగానే.. ఎస్సీ రిజర్వ్డ్ గా ఉన్న ఆ స్థానంలో ఎవరిని నిలబెట్టాలన్న విషయంపై తనదైన శైలి సమీక్షలు చేసిన బీజేపీ… కర్ణాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి ఇటీవలే రిటైర్ అయిన రత్నప్రభ వైపు దృష్టి సారించింది. రత్నప్రభ కూడా ఐఏఎస్ గా పదవీ విరమణ చేసిన వెంటనే కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. ఇంకేముంది… ఏపీ ఆరిజిన్ అయి ఉండి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన రత్నప్రభనే తన అభ్యర్థి అంటూ బీజేపీ చాలా కాలం క్రితమే డిసైడ్ అయిపోయింది.
అయితే ఎన్నికలకు నామినేషన్ల దాఖలు గడువు సమీపించిన తరుణంలోనే అధికారికంగా ఆమె అభ్యర్థిత్వాన్ని ప్రకటించింది. ఇక్కడిదాకా బాగానే ఉన్నా… ఎస్సీ సామాజిక వర్గానికి చెందడం, అందునా క్రిస్టియన్ అయిన రత్నప్రభ తిరుపతి బరిలో బీజేపీ అభ్యర్థిగా ప్రచారం చేస్తూనే… తనకు వైరి వర్గంగా ఉన్న వైసీపీపై తనదైన శైలి ప్రశంసలు కురిపిస్తున్నారు.
వైసీపీపైనా, ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపైనా ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంచిని మెచ్చుకుంటే తప్పేమిటన్న కోణంలో ఆమె చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే… మిగిలిన సమయంలో అయితే ఫరవా లేదు గానీ… ఎన్నికల సమయంలో… అది కూడా పోలింగ్ కు మరికొన్ని రోజుల సమయం ఉన్న నేపథ్యంలో ప్రత్యర్థి పార్టీపై ప్రశంసలు అంటే కాస్త ఆలోచించాల్సిందే కదా.
ఈ దిశగానే ఏపీకి చెందిన రాజకీయ పరిశీలకులు ఈ దిశగా కాస్తంత లోతుగానే ఆలోచించారు. దీంతో రత్నప్రభ వ్యూహమేంటో, తిరుపతి ఉప ఎన్నికలో ఆమె భవిష్యత్తు ఏమిటో, ఎన్నికలు ముగియగానే… ఆమె భవిష్యత్తు ప్రణాళికలు ఏమిటో… ఇట్టే పట్టేశారు. అంతేకాకుండా వైసీపీకి కూడా ఇప్పుడు రత్నప్రభ అవసరం ఉందని కూడా చెప్పక తప్పదు.
ఎందుకంటే… జగన్ సొంత జిల్లా కడపలోని ఎస్సీ రిజర్వ్ డ్ నియోజకవర్గం అయిన బద్వేల్ ఎమ్మెల్యేగా మొన్నటి ఎన్నికల్లో వైసీపీ తరఫున విజయం సాధించిన వెంకటసుబ్బయ్య అనారోగ్యంతో ఇటీవలే మృతి చెందిన విషయం తెలిసిందే. అంటే… అక్కడ కూడా త్వరలోనే ఉప ఎన్నిక అనివార్యమే కదా. ఆ ఎన్నికకు వైసీపీ తన అభ్యర్థిని వెతుక్కోవాల్సి ఉంది.
అదే సమయంలో తిరుపతి ఉప ఎన్నికలో రత్నప్రభ దిగడం, గతంలో ఏపీలో డిప్యూటేషన్ పై పనిచేస్తున్న సందర్భంగా వైఎస్ రాజశేఖరరెడ్డి సర్కారులో కీలకంగా పనిచేయడం, జగన్ అక్రమాస్తుల కేసులో నిందితురాలిగా మారడం… ఇలా ఒక్కొక్కటిగా కీలక అంశాలన్నింటినీ గుదిగుచ్చి పరిశీలించగా… తిరుపతి బరిలో బీజేపీ అభ్యర్థిగా ఉండి కూడా వైసీపీ పట్ల సానుకూల వ్యాఖ్యలు చేస్తున్న రత్నప్రభ… తిరుపతి ఉప ఎన్నిక ముగియగానే… వైసీపీలోకి జంప్ చేయడం ఖాయమేనని తేల్చేశారు. అంతేకాకుండా బద్వేల్ వైసీపీ అభ్యర్ధిగా కూడా రత్నప్రభను వైసీపీ నిలబెట్టడం ఖాయమని, ఆమెను గెలిపించుకుని అసెంబ్లీకి తీసుకెళ్లడం కూడా ఖాయమన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
ఇక తిరుపతి బైపోల్ అంశానికి వస్తే.. గత సార్వత్రిక ఎన్నికల్లో తిరుపతి నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థికి నోటా కంటే కూడా తక్కువ ఓట్లే వచ్చాయి. ఈ సారి జనసేనతో పొత్తు పెట్టుకుని మరీ బీజేపీ తన అభ్యర్థిగా రత్నప్రభను బరిలోకి దించింది. అయితే తిరుపతి పరిధిలో జనసేనాని పవన్ కల్యాణ్ సామాజిక వర్గం ఓట్టు కాస్తంత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో తమ పార్టీ అభ్యర్థినే బరిలోకి దింపుతామంటూ జనసేన పట్టుబట్టింది.
మరి ఏ కారణం చేతనె బీజేపీ అభ్యర్థికే తలూపింది. అయితే తాజా పరిణామాలు చూస్తుంటే.. ఈ దఫా కూడా తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీకి నోటాను మించి ఓట్లు రావన్న వాదనలు వినిపిస్తున్నాయి. అంటే… తిరుపతిలో నోటా కంటే తక్కువ ఓట్లతోనే ఓటమి చవిచూడనున్న రత్నప్రభ… ఈ ఎన్నిక ముగియగానే… వైసీపీలో చేరిపోయి బద్వేల్ ఉప ఎన్నికలో మంచి మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలుపొందనున్నారన్న మాట. ఈ విషయంలో ఏ ఒక్కరికీ ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్న దిశగా సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి.