పెగాసస్ స్పైవేర్ వ్యవహారం కొద్ది నెలల క్రితం దేశవ్యాప్తంగా పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. మన దేశంలోని కొందరు ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులపై మోడీ సర్కార్ ఈ స్పైవేర్ ను ఉపయోగించి నిఘా పెట్టిందని విపక్షాలు ఆరోపించాయి. అంతేకాదు, పార్లమెంటులో ఈ విషయంపై చర్చించాలని పట్టుబట్టాయి. కానీ, అలాంటిదేమీ లేదని మోడీ సర్కార్ తేల్చిపడేసింది. ఈ క్రమంలోనే తాజాగా మోడీ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేలా పెగాసస్ వ్యవహారంపై న్యూయార్క్ టైమ్స్ లో సంచలన కథనం వెలువడింది. భారత్-ఇజ్రాయెల్ మధ్య 2017లో కుదిరిన ఒప్పందంలో ‘పెగాసస్’ స్పైవేర్ ఓ భాగమని ఆ కథనం సారాంశం.
ఈ క్రమంలోనే తాజాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. మోడీ ప్రభుత్వం దేశద్రోహానికి పాల్పడిందని రాహుల్ ఆరోపించారు. ప్రజలు, ప్రభుత్వ నేతలపై గూఢచర్యం చేయడానికి మోడీ ప్రభుత్వం పెగాసస్‌ను కొనుగోలు చేసిందని రాహుల్ ఆరోపించారు. ఫోన్లను ట్యాప్ చేయడం ద్వారా ప్రతిపక్షాన్ని, కోర్టును వారు లక్ష్యంగా చేసుకున్నరని, ఇది దేశద్రోహం అని రాహుల్ ఆరోపించారు. మోడీ ప్రభుత్వం భారత దేశానికి శత్రువుగా ఎందుకు వ్యవహరించిందని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. యుద్ధంలో ఉపయోగించే ఆయుధాన్ని భారతీయులపై ఎందుకు ఉపయోగించిందని నిలదీశారు.
రాహుల్ గాంధీతోపాటు భారతీయులపై నిఘా పెట్టేందుకు బీజేపీ ప్రభుత్వం మిలిటరీ గ్రేడ్ స్పైవేర్‌ను ఉపయోగించిందనడానికి ఇదే రుజువని కాంగ్రెస్ అధికార ప్రతినిధి షమా మహమ్మద్ మండిపడ్డారు. “The Battle for the World’s Most Powerful Cyber weapon” శీర్షికతో న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన ఆ వ్యాసం దుమారం రేపుతోంది. 2017లో ఇజ్రాయెల్‌లో మోడీ పర్యటించినపుడు ఇరు దేశాల మధ్య దాదాపు 2 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాలు కుదిరాయని ఆ వ్యాసంలో పేర్కొంది. అత్యాధునిక ఆయుధాలు, ఇంటెలిజెన్స్ గేర్ అమ్మకం కోసం కుదిరిన ఆ ఒప్పందాల్లో పెగాసస్ స్పైవేర్, మిసైల్ సిస్టమ్ చాలా కీలకమైనవని పేర్కొంది. అయితే, ఆ కథనంపై, రాహుల్ గాంధీ ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. ఏది ఏమైనా…మోడీపై న్యూయార్క్ టైమ్స్ సంచలన కథనం…సోషల్ మీడియాలో వైరల్ అయింది.