ఏపీ ప్రభుత్వానికి, సినిమా పరిశ్రమకు మధ్య రాజుకున్న వివాదం ఎక్కడా ఆగడం లేదు. ఇప్పటి వరకు కొందరు ఆర్టిస్టులు మాత్రమే స్పందిస్తే.. ఇప్పుడు తాజాగా ప్రముఖ నిర్మాత, దర్శకులు.. తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమపై ఏపీ నేతలు చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించారు. హైదరాబాద్‌లోని ఫిల్మ్‌ఛాంబర్‌లో మాట్లాడిన ఆయన.. సినీ పరిశ్రమను నిందిస్తున్న నాయకులు తలదించుకోవాలన్నారు. కుల ప్రస్తావన లేకుండా ఉపాధి కల్పించేది సినీ పరిశ్రమేనని తేల్చి చెప్పారు.
సామాజిక వర్గాల పేరుతో రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. మీ ఎమ్మెల్యేలు ఎంత తింటున్నారో బహిరంగ చర్చకు సిద్ధమా? అంటూ తమ్మారెడ్డి నిలదీశారు. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మీ ఆస్తులెంత? ఇప్పుడెంత? అంటూ సూటిగా ప్రశ్నించారు. రూ.కోట్లు పెట్టి నాయకులను ఎన్నుకుంటున్నామన్న ఆయన.. వాళ్లు మాత్రం రూపాయి పెట్టి కోట్లు కొల్లగొడుతున్నారంటూ విమర్శించారు. సినీ పరిశ్రమ అంటే నిర్మాతల మండలని స్పష్టం చేశారు. రాజకీయ నేతలు ఇంకెప్పుడు బెదిరింపులకు పాల్పడవద్దని హెచ్చరించారు.
“సినీ పరిశ్రమను నిందిస్తున్న నాయకులు తలదించుకోవాలి. కుల ప్రస్తావన లేకుండా ఉపాధి కల్పించేది సినీ పరిశ్రమే. సామాజిక వర్గాల పేరుతో రాద్ధాంతం ఎందుకు?. మీ ఎమ్మెల్యేలు ఎంత తింటున్నారో బహిరంగ చర్చకు సిద్ధమా?. మీరు వచ్చినప్పుడు మీ ఆస్తులెంత? ఇప్పుడెంత?. మేము రూ.కోట్లు ఖర్చు పెట్టి రూపాయలు ఏరుకుంటున్నాం. మీరు రూపాయి పెట్టి కోట్లు కొల్లగొడుతున్నారు. రాజకీయ నేతలు ఇంకెప్పుడు బెదిరింపులకు పాల్పడవద్దు“ అని భరద్వాజ పేర్కొన్నారు.
‘‘సినిమా వాళ్లంటే చీప్‌గా దొరికారని బలిశారు అని మాట్లాడుతున్నారు. ఎవరు బలిశారు సర్?.. మీ ఎమ్మెల్యేలు ఎంతెంత తింటున్నారు?.. మీ చరిత్రలేంటి?.. వాటి గురించి మాట్లాడదామా?.. ఓపెన్ డిబేట్‌కు వస్తారా ఎవరైనా?.. దమ్ముందా?.. ఎవరిని మెప్పించడానికి మీరు బలుపులు, కులాల గురించి మాట్లాడుతున్నారు? మీరంతా రాజకీయాల్లోకి రాకముందు మీ ఆస్తులు ఎంత… వచ్చాక ఎంత?.. మీ పార్టీలోని చోటా మోటా నాయకుల ఆస్తులు తీయండి.. మా సినిమా వాళ్ల ఆస్తులు తీద్దాం రండి. ఎవరి ఆస్తి ఎంతుందో లెక్క తీద్దామా?.. దమ్ముంటే రండి.. ఓపెన్ ఛాలెంజ్. అని వ్యాఖ్యానించారు.
మేము కష్టపడి సంపాదిస్తున్నాం. సినిమాను తయారు చేస్తున్నాం. మా కళలను అమ్ముతున్నాం. ఒక సినిమాకు 200 మందిపైనే కష్టపడతారు. మేము కోట్లు కోట్లు పెట్టి పైసా పైసా ఏరుకుంటున్నాం. అంతేకానీ మీలా ఒక రూపాయ పెట్టి మొత్తం అంతా దోచుకుతినట్లేదు. మమ్మల్ని బలుపు అనడానికి మీరెవరు అసలు? మీ బలుపు సంగతి మీరు చూసుకోండి. పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడితే మర్యాదగా ఉండదని సవినయంగా మనవి చేస్తున్నా.’’ అని తమ్మారెడ్డి భరద్వాజా హెచ్చరించారు.