“సర్వవ్యాపి, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు అయిన ప్రధాని మోడీకి కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం చేసిన దోపిడీ కనిపించలేదా? 40శాతం కమీషన్ సర్కారు చేసిన లూటీ తెలియలేదా?” అని కాంగ్రెస్ అగ్రనేత, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా తీవ్రస్థాయిలో ప్రశ్నించారు. గతానికి భిన్నంగా ప్రధానిపై ఆమె మాటలతూటాలతో విరుచుకుపడ్డారు.
“చాలా ఆశ్చర్యం! సర్వవ్యాపి, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు అయిన నరేంద్ర మోదీకి కర్ణాటకలో జరుగుతున్న లూటీ తెలియదా? 40 శాతం కమీషన్ సర్కారు చేస్తున్న దోపిడీ కనిపించదా? ఇంత జరుగుతున్నా ‘వికాసపురుష’ నరేంద్ర మోడీ మాత్రం కర్ణాటక అభివృద్ధిపై కలలు కంటున్నానని, ఈ రాష్ట్రాన్ని దేశం ముందు ‘అభివృద్ధి నమూనాగా నిలబెడతానని ఎందుకు చెబుతున్నారో తెలుసుకోవాలని ఉంది” అని నిప్పులు చెరిగారు. అదేసమయంలో ‘సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, అందరికన్నా గొప్పవాడు, మహామేధావి, వికాస్పురుష్’ అంటూ.. పలు సందర్భాల్లో మోడీని ఎద్దేవా చేశారు.
“ఓ సర్వోన్నతుడా.. సర్వశక్తిమంతుడా.. సర్వవ్యాపీ.. మహామేధావీ.. రాష్ట్రంలో గత నాలుగేళ్లుగా మీ ప్రభుత్వమే ఉంది.. మరి మీ కలలు ఎందుకు నెరవేర్చుకోలేదు? ఇక్కడి ప్రభుత్వంపై 40% కమీషన్ సర్కారు అంటూ ప్రజలు గగ్గోలు పెట్టినప్పుడు మీరేం చేశారు?” అని ప్రశ్నించారు. “కర్ణాటకలో అవినీతి, లూటీలు జరుగుతున్నప్పుడు ప్రధాని కళ్లుమూసుకున్నారు. ఎందుకంటే.. ఆ సమయంలో ఆయన కలలు కంటున్నారు. అందుకే దోపిడీ ముఠాను స్వేచ్ఛగా వదిలేశారు” అని ప్రియాంక వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
“ఈ సర్వజ్ఞుడికి(మోడీ) 40% కమీషన్‌పై కాంట్రాక్టర్లు లేఖలు రాసి ఆత్మహత్యలకు పాల్పడినప్పుడు కూడా ఆయన కలలు కంటూనే ఉన్నారు. రైతులు ఆత్మహత్య చేసుకున్నప్పుడు కూడా మౌనంగా ఉండి కలలుకన్నారు” అని విమర్శలు గుప్పించారు. మూడున్నరేళ్ల కమలనాథుల పాలనలో లక్షన్నరకోట్ల ప్రజాధనం లూటీ అయిందని ఆరోపించారు. ఈ సొమ్ముతో 100 ఎయిమ్స్ ఆసుపత్రులను నిర్మించడంతోపాటు, 2,250 కిలోమీటర్ల పొడవైన ఆరే లేన్ల ఎక్స్‌ప్రెస్‌వే కూడా నిర్మించుకోవచ్చని, 187 ఈఎస్ఐ ఆసుపత్రులను, 30 వేల స్మార్ట్ క్లాస్ట్రూమ్లను నిర్మించుకోవచ్చని ప్రియాంక వివరించారు.
బెం గళూరులో ఏర్పాటు కావాల్సిన బహుళ జాతి కంపెనీలు.. ఇక్కడి బీజేపీ సర్కారు అవినీతి కారణంగా హైదరాబాద్, చెన్నై వంటి ప్రాంతాలకు తరలి పోయాయని ప్రియాంక గాంధీ విమర్శించారు. దీంతో బెంగళూరు యువతకు ఉపాధి పోయిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 2.5 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు హామీ ఇచ్చారు.