గత కొద్ది రోజులుగా ప్రముఖ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్లో చేరుతారన్న వార్తలు హల్చల్ చేస్తున్నాయి. కానీ ఆయన మాత్రం తాను చేరబోనని ఇవాళ ట్విటర్ వేదిక ద్వారా స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధినేత్రి చేసిన అప్పీల్ ను ఆయన సున్నితంగానే తిరస్కరించారు. దీంతో కాంగ్రెస్ నాయకులు డీలా పడిపోయారు.
ఎన్నికల వేళ కన్సల్టెంట్ గా ఉంటాను తప్ప పార్టీలో చేరేదే లేదు అని స్పష్టం చేయడంతో ఇకపై ఆయన ఎక్స్ ట్రనల్ కాంపొనెంట్ గానే పనిచేయనున్నారు. ఆ విధంగా సోనియా కు సలహాలు ఇచ్చే ఓ సంస్థగా ఐ ప్యాక్ ఉండనుంది.
వాస్తవానికి గత రెండు రోజులుగా ప్రశాంత్ కిశోర్ అనే బీహారీ కాంగ్రెస్ పార్టీలో చేరే విషయమై బోలెడు వార్తలు వచ్చాయి. ఇదే సమయంలో కాంగ్రెస్ వర్గాలలో కూడా జోష్ పెరిగింది. కొన్ని పత్రికలు కొన్ని లీక్స్ కూడా ఇచ్చాయి. పీకే చెప్పారంటూ కొన్ని లీక్స్ ఇచ్చాయి. కానీ ఇవేవీ కాదని ఆయన మళ్లీ మొదటికే వచ్చారు. దీంతో టీఆర్ఎస్ శ్రేణులు పండగ చేసుకుంటున్నాయి.
ఎప్పటి నుంచో తెలంగాణ రాష్ట్ర సమితికి ఇచ్చిన మాట నిలబెట్టేందుకు పీకే ఇవాళ కాంగ్రెస్ అధిష్టానం ఓ స్పష్టత ఇచ్చారు. అయితే ప్రగతి భవన్ కేంద్రంగా జరిగిన పరిణామాల నేపథ్యంలోనే ప్రశాంత్ కిశోర్ మనసు మార్చుకున్నారా లేకా ఇకపై ఏ పార్టీకి కన్సల్టెంట్ గా ఉండవద్దు అని చెప్పిన సోనియా మాటకు నొచ్చుకున్నారా అన్నది కూడా తేలాల్సి ఉంది.
వాస్తవానికి ఐ ప్యాక్ పేరిట పనిచేస్తున్న ప్రశాంత్ కిశోర్ పొలిటికల్ కన్సల్టెన్సీ ఇప్పటికే కొన్ని కమిట్మెంట్స్ తో ఉంది. అందుకు తగ్గ ఆర్థిక లావాదేవీలు కూడా పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిశోర్ ఏదో ఒక పార్టీకి మాత్రమే తాను పరిమితం అయి ఉండాలనుకుంటే కుదరని పని. అందుకే అధినేత్రి సోనియా మాటను కాదనుకున్నారు. వాస్తవానికి పీకే వస్తే కాంగ్రెస్ కు పూర్వ వైభవం వస్తుందని, ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ లో పరిణామాలు ఇంకాస్త చక్కబడతాయని భావించారు కానీ అది కూడా సాధ్యం కాలేదు. దీంతో కాంగ్రెస్ వర్గాలు మరో ప్రత్యామ్నాయం వెతుక్కోవాల్సి ఉంది.
వాస్తవానికి తెలంగాణలో కేసీఆర్ మరియు కాంగ్రెస్ కలిసి పనిచేయనున్నాయని, ఆ బాధ్యత పీకే తీసుకుంటారని కొందరు అన్నారు. అదేవిధంగా కొన్ని పత్రికల ప్రతినిధులు కాంగ్రెస్ లో టీఆర్ఎస్ విలీనం ఉంటుందని కూడా అన్నారు. కానీ ఇవన్నీ టీ కప్పులో తుఫాను మాదిరిగానే ఉన్నాయి.
ఈ నేపథ్యంలో కొందరు కాంగ్రెస్ నేతలు ఆయన వస్తేనే కానీ ఆయన మాట్లాడితేనే కానీ ఏమీ చెప్పలేం అన్న విధంగానే స్పందించారు. ఇదే సమయంలో టీఆర్ఎస్ తో ప్రశాంత్ కిశోర్ తెగ తెంపులు చేసుకుని, తమతో్ పనిచేయనున్నారని టీ కాంగ్రెస్ బాస్ రేవంత్ రెడ్డి అన్నారు. ఏ విధంగా చూసుకున్నా కూడా ఇకపై కాంగ్రెస్ నాయకులకు మరో పెద్ద దిక్కు సోనియా తప్ప మరొకరు కాదని తేలిపోయింది.
ఒకవేళ ప్రశాంత్ కిశోర్ వచ్చినా కన్సల్టెంట్ గానే ఉంటారు కనుక ఆయన పెత్తనం టీ కాంగ్ పై ఉండదు అని కూడా తేలిపోయింది. ఇక ఏపీలో కూడా జగన్ తో కలిసి కాంగ్రెస్ పనిచేయనుందన్న వార్తలు కూడా గాలి వార్తలే అని నిర్థారణ అయింది. మాజీ మంత్రి పేర్ని నాని కూడా వీటిని నిన్ననే కొట్టిపారేశారు. ఆ విధంగా నిన్ననే పేర్ని నాని మాటల్లో ఓ విధంగా ఓ స్పష్టత దొరికింది. ఏదేమయినప్పటికీ సుదీర్ఘ చరిత్ర ఉన్న జాతీయ కాంగ్రెస్ పార్టీ ఓ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ కోసం ఇంతగా పాకులాడడం ఓ విధంగా వింత మరియు విడ్డూరం కూడా !