తిరుమలలోని ఎస్వీ గోశాలలో గత 3 నెలల కాలంలో100 ఆవులు మరణించాయని వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే. అంతేకాదు, టీటీడీలో తన మనుషులు పనిచేస్తున్నారని, వారు ఎప్పటికప్పుడు తనకు సమాచారం ఇస్తుంటారని చెప్పారు. ఆ సమాచారంతోనే తాను చనిపోయిన గోవులు ఎస్వీ గోశాలవని చెప్పానని, తన ఆరోపణలు తప్పని తేలితే చర్యలు తీసుకోవచ్చని సవాల్ విసిరారు.
ఈ క్రమంలోనే భూమనపై చర్యలకు టీటీడీ సిద్ధమైంది. భూమనపై ఎస్పీ హర్ష వర్ధన్ రాజుకు టీటీడీ సభ్యుడు భానుప్రకాశ్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. గోశాలను గోవధ శాలగా మార్చారని భూమన తప్పుడు ఆరోపణలు చేశారని, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. టీటీడీ ఛైర్మన్‌గా భూమన ఉన్నప్పుడే భారీ సంఖ్యలో గోవులు మృత్యువాత పడ్డాయని భాను ప్రకాశ్ ఆరోపించారు. వైసీపీ హయాంలో పురుగులు పట్టిన ఆహారాన్ని గోవులకు పెట్టారని, ఆ అక్రమాలను ఆధారాలతో సహా బయటపెట్టామని గుర్తు చేశారు.
టీటీడీలో అక్రమాలపై విజిలెన్స్ విచారణ కొనసాగుతుందని, ఎస్వీ గోశాలపై అసత్య ప్రచారాలు చేస్తూ, భక్తుల మనోభావాలు దెబ్బ తినేలా భూమన వ్యవహరించారని ఫైర్ అయ్యారు. గోవిందుడు, గోవులతో ఆటలొద్దని వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు.